మా మోడీ ఫోటో పెట్టండి.. మా సొమ్ము వాడుకుంటున్నారు అంటూ, గత వారం రోజులుగా రాష్ట్ర బీజేపీ నేతలు, ఫోటోల ప్రచారం మొదలు పెట్టారు. నిజానికి, ఈ ఫోటోల ప్రచారానికి చంద్రబాబు ఇది వరకే కౌంటర్ ఇచ్చారు. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, మన్మోహన్ ఫోటో పెట్టారా అని అడగగా, ఒక్కడికి సౌండ్ లేదు. అలాగే కేంద్రం ఇచ్చే సొమ్ములతో, రాష్ట్రం పండగ చేసుకుంటుంది అనే దానికి కూడా చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. కేంద్రానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని, రాష్ట్రం నుంచి వెళ్ళే డబ్బులు కదా కేంద్రం తిరిగి రాష్ట్రాలకు ఇచ్చేది అని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అయినా బీజేపీ నేతలకు ఫోటోల పిచ్చ తగ్గలేదు.. వారం నుంచి, మా మోడీ ఫోటోలు పెట్టండో అంటూ హడావిడి చేస్తున్నారు. దీని పై తెలుగుదేశం నాయకులు గట్టిగా సమాధానం చెప్పారు.
కేంద్రం నిధులిస్తుంటే అవి తమవిగా టీడీపీ ప్రచారం చేసుకుంటోందని బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి మంగళవారం నాడు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. పురందేశ్వరి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫ్లెక్సీలతో ఎదురుదాడి చేశారు. కేంద్ర పథకాలకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టడంలేదని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలకు హోల్డింగ్‌లతో మరోసారి టీడీపీ నేత కాట్రగడ్డ బాబు కౌంటర్ ఇచ్చారు. ‘కుట్ర, విద్వేష రాజకీయాలు చేసే వారి ఫోటో పెట్టాలా అమ్మా.. పురందేశ్వరి, అయ్యా.. కన్నా లక్ష్మీనారాయణ.. ప్రధాని నరేంద్ర మోదీతో రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇస్తున్నామని ప్రకటింపజేసి, అమలు చేయించండి.. మీ కోరిక ప్రకారమే ఊరూ, వాడా అన్ని పథకాలకు మోదీగారు ఫోటో పెడతాం.. ఐదు కోట్ల ఆంధ్రుల తరుఫున.. కాట్రగడ్డ బాబు’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
పురందేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణను ఉద్దేశించి హోర్డింగ్ లపై చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గతంలోనూ కేంద్రం చేస్తున్న మోసం గురించి కాట్రగడ్డ వేయించిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ‘కాంగ్రెస్ తల్లిని చంపింది.. బీజేపీ బిడ్డ గొంతు నులుముతోంది.. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన తెలుగు ప్రజలు.. బీజేపీకి బుద్ధి చెబుతార’ని పోస్టర్ వేయించారు. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ నమ్మించి నట్టేట ముంచారని, గుండె రగిలిన ఆత్మగౌరవ జాతి నీ వెంట ఉన్నది, నడిసంద్రాన ప్రగతి నావ నడిపించాలి, కుట్ర, కుతంత్రాలకు ఎదురొడ్డి పోరాడి నావ దరిచేర్చు మొనగాడు చంద్రబాబు’అని అందులో పేర్కొన్నారు. వీటిపై ఘాటైన సమాధానాన్ని చెబుతామని బీజేపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.