గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న భారతీయ ఆర్థిక సంఘం (ఐఈఏ) శతవార్షిక సదస్సు రెండో రోజున ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడిగా పని చేసిన కౌశిక్ బసు పాల్గున్నారు. సదస్సులో ఆయన ప్రసంగించారు. తాను ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి అనుభావాలను కౌశిక్ బసు వివరించారు. కేవలం ఇద్దరు రాజకీయ నాయకులు మాత్రమే తనతో దేశ ఆర్థికాంశాలపై నిస్వార్థంగా చర్చించేవారని.. వారిలో ఒకరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. మరొకరు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ అని తెలిపారు.
రాజకీయ నేతలు రాజకీయాలే మాట్లాడతారని.. కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచిస్తారని, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆయనతో పలుసార్లు సమావేశమయ్యానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై భరోసా వ్యక్తం చేసిన ఆయన, ఆర్థిక సంస్కరణల అమలు విషయాలపై ఆలోచించే అతికొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరని ప్రశంసించారు. కొత్త రాష్ట్రంగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీ, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతోందని కితాబిచ్చారు. న్యూయార్క్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇంగ్లీషు భాష మాట్లాడే వారి తర్వాత తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని అన్నారు
ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ, దీని వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు తగ్గిందని, నోట్ల రద్దు ఇప్పటికీ సామాన్యులపై ప్రభావం చూపుతోందన్నారు. ఉగ్రవాదులు నకిలీ నోట్లను వ్యవస్థలోకి తీసుకొస్తే వాటిని ఏరివేయాలే తప్ప.. మొత్తం నోట్లన్నీ మార్చేయాలనుకోవడం తప్పని.. ఈ నిర్ణయంతో ఆ నోట్లు కూడా ప్రధాన స్రవంతిలోకి వచ్చాయని చెప్పారు. ఈ త్రైమాసికం తర్వాత నోట్ల రద్దు ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ గురించి ప్రస్తావిస్తూ..ఇది దేశానికి అవసరమే కానీ, అమలు తీరు సక్రమంగా లేదని విమర్శించారు.