తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారంతో వైకాప అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ లో ఆస్తులున్న వారిపై బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ సారి తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక చివరి నిమిషం వరకు సాగదీయబోమని, సరైన సమయంలో ప్రకటించుకుంటూ ముందుకు వెళతామని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పిన అన్ని అంశాలను నెరవేర్చామని ఆయన స్పష్టంచేశారు. ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేందుకు పార్టీ యంత్రాంగం కృషి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రధాని మోడీ జీర్ణించుకోలేరని, ఏపీని చూస్తుంటే కేసీఆర్‌కు కూడా కంటగింపుగా ఉందని సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎలా వెళ్లాలనేది ఇవాళ నిర్ణయిస్తామన్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను తాము డబ్బులు ఇచ్చి ఎలాగోలా పూర్తి చేపిస్తున్నామని, అయినా కేంద్రం కొర్రీల మీద కొర్రీలు వేస్తోందని విమర్శించారు. ఉగ్రవాదం, తీవ్రవాదానికి తెదేపా ఎప్పుడూ వ్యతిరేకమని, దేశ భద్రతలో పార్టీ ఎప్పుడూ రాజీపడదని స్పష్టంచేశారు. రక్షణశాఖలో కుంభకోణాలను తెదేపా ఖండిస్తోందని, అందుకే రఫేల్‌పై రాజీలేని పోరాటం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
జగన్ కు ఎన్నికల అంటే వ్యాపారమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ హైదరాబాద్‌లో విలాసంగా కూర్చుని, అక్కడే కేసీఆర్ సహకారంతో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో నివసించడమే ఇష్టంలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. వైకాపా టికెట్లకు ప్రజాసేవ కొలమానం కాదు.. డబ్బు సంచులే కొలమానమని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. జగన్ ఒకసారి పోటీ చేసిన వారికి మరోసారి అంత తేలిగ్గా అవకాశమివ్వరని, డబ్బులు ఎవరికిస్తే వారికే టికెట్లు ఇచ్చే వ్యక్తి అని విమర్శించారు. వైకాపాలో అంతా ఒక్కసారి మాత్రమే ఆడే ఆటగాళ్లని (వన్‌టైం ప్లేయర్స్) ఎద్దేవాచేశారు.