తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న కుమార్తె కల్వకుంట్ల రమ్యారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలుసుకున్నారు. ప్రత్యేకంగా చంద్రబాబుని కలవడానికి మంగళవారం అమరావతి వెళ్లిన రమ్యారావు ఉండవల్లిలోని ఏపీ సచివాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటు కానుండటం, ఆ కూటమిలో టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రమ్యారావు చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రమ్యారావు డిసెంబర్ లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీనంగర్ జిల్లా నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఇటీవల కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరితో ఆమో మనస్తాపం చెంది.. కరీంగనర్ లో జరిగిన ఓ సమావేశం నుంచి అర్ధంరంగా నిష్ర్కమించారు. ఈ పరిస్ధితుల్లో ఆమె అమరావతి వెళ్లి చంద్రబాబును కలవడం... తనకు టిక్కెట్ వచ్చేలా సహకరించమని కోరండం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీలో రమ్య విషయం ప్రస్తావించారు. ఈ సమయంలో రమ్యను పార్టీలోకి తీసుకుంటే .. రెచ్చగొట్టినట్టు ఉంటుందని అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో తెలంగాణ టీడీపీ నేతలు ఏకీభవించారు.
మరో పక్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ రోజు టీటీడీపీ నేతల సమావేశం ముగిసింది. టీటీడీపీ చీఫ్ ఎల్.రమణ నేతృత్వంలో ఈ రోజు బాబును కలుసుకున్న నేతలు తెలంగాణలో పోటీ చేయనున్న సీట్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అమరావతిలో ఈ రోజు బాబుతో సమావేశమైన అనంతరం రమణ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతా ప్రతిపక్షాలను ఏకం చేస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ రెండు అంకెల సీట్లను గెలుచుకుంటుందని రమణ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థుల విజయమే ముఖ్యమనీ, సీట్ల సంఖ్యను పట్టించుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.