మొక్కు చెల్లించటానికి కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చిన కెసిఆర్, రాజధాని రోడ్లు చూసి కాంప్లిమెంట్ ఇచ్చారు. కెసిఆర్ తో పాటు ప్రోటోకాల్ లో భాగంగా, మంత్రి దేవినేని ఉమా ఉన్నారు. గన్నవరం దిగిన దగ్గర నుంచి, దర్శనం అయ్యే వరకు, దేవినేని ఉమా అన్నీ దగ్గర ఉంది చూసుకున్నారు. ఈ సందర్భంగా, దుర్గమ్మ దర్శనం బాగా చేయించారని ఏపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ తన సమక్షంలోనే అమ్మవారికి ముక్కుపుడకను అలంకరించడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబుతో మాట్లాడి కృతజ్ఞతలు తెలుపుతానని చెప్పారు. కానీ ఆముదాలవలస సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారని సీఎంవో చెప్పారని.. హైదరాబాద్ వెళ్లగానే ఫోన్ చేస్తానని తెలిపారు.
ఇదే సందర్భంలో రాజధాని రోడ్ల గురించి, దేవినేని ఉమాతో తన అభిప్రయన్ని పంచుకున్నారు. విజయవాడ బాగా అభివృద్ధి చెందిందని కితాబిచ్చారు. అలాగే ఎయిర్‌పోర్టు కూడా బాగుందని ప్రశంసించారు. బందర్ రోడ్డును బాగా విస్తరించారని.. ఎయిర్‌పోర్టు నుంచి బందరు రోడ్డు వరకు గ్రీనరీ బాగుందని మెచ్చుకున్నారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా పెయింటింగులు కూడా బాగున్నాయని తెలిపారు. చెట్లకు కూడా రంగులు వేసారని, వర్షం పడినా, ఎక్కడా పెద్దగా ఇబ్బంది కనిపించలేదని అన్నారు. ఈ సందర్భంగా, విజయవాడకు స్వచ్చ ర్యాంకింగ్స్ లో మొదటి వచ్చిన విషయం కెసిఆర్ కు చెప్పారు ఉమా.. రాష్ట్ర ప్రభుత్వం, తీసుకుంటున్న చర్యలు వివరించారు.
కెసిఆర్ గతాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. బెజవాడతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రవాణా మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ బస్టాండ్ నిర్మించామని గుర్తుచేశారు. ఆసియాలోనే పెద్ద బస్టాండ్‌గా ఉండాలని ఎన్టీఆర్ అన్నారని జ్ఞాపకం చేశారు. బస్టాండ్ పనులను పరిశీలిందుకే అనేక సార్లు విజయవాడ వచ్చానని వెల్లడించారు. దుర్గగుడి బాగా మారిపోయిందని కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు కొండపల్లి బొమ్మను మంత్రి దేవినేని ఉమ బహూకరించారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నంతో పాటు పవిత్రసంగమం తన నియోజకవర్గంలోనే ఉందని దేవినేని ఉమ వివరించారు. దుర్గగుడి ఘాట్‌లను ఎప్పుడు అభివృద్ధి చేశారని దేవినేని ఉమను కేసీఆర్ ఆరా తీశారు. పుష్కరాల సమయంలోనే అభివృద్ధి చేశామని దేవినేని ఉమ బదిలిచ్చారు.