బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తేవడంలో భాగంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం కోల్‌కతాలో మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మమత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ నేతలంతా మమతతో కలిసి కూర్చున్నప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ గురించి మమత బెనర్జీ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. 'టీఆర్ఎస్ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏతో ఉండిపోయింది. ఆ పార్టీ ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి' అని ఆమె అన్నారు.
కొంత కాలం క్రితం ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కోల్కతా వెళ్లి మమతను కలిసిన విషయం తెలిసిందే. అప్పుడే ఆయన నిబద్ధత పై ఆమె కొంత ప్రశ్నార్థకంగా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాబుతో భేటీలో ఆమె తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. తెలంగాణ ఫలితాలు ఎలా ఉండబో తున్నాయని ఆమె ఆరా తీశారు. మహా కూటమికి స్పష్టమైన విజయావకాశాలు కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాలకు సంబంధించి టీడీపీ నేతల అంచనాలను కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు.
భేటీ అనంతరం మమత, చంద్రబాబు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. మీ ప్రధాని అభ్యర్థి ఎవరని ప్రశ్నించగా... ‘‘మాలో అనేక మంది మోదీ కంటే రాజకీయంగా సీనియర్లమే. అర్హత కలిగినవారు చాలా మంది ఉన్నారు. ఎవరికి అవకాశమివ్వాలో అందరం కలిసి నిర్ణయించుకుంటాం’’ అని మమత చెప్పారు. భవిష్యత్ ప్రణాళికపై చంద్రబాబుతో చర్చించానన్నారు. ‘ఒక్కటి మాత్రం చెప్పగలను. దేశాన్ని కాపాడుకోవడంలో బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మేమంతా కలిసికట్టుగా ఉన్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మోదీ ప్రభుతానికి వ్యతిరేకంగా నడుస్తాం. పార్లమెంటు సమావేశాలకు ముందు కలిసి భావి ప్రణాళికను ఖరారుచేస్తాం’ అని వివరించారు.