హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో టీఆర్ఎస్ సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సభ.. జనం లేక వెలవెలబోయింది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించి ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. మూడు నియోజకవర్గాలకు సంబంధించి లక్షా యాభైవేల మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. జనం మధ్యాహ్నం మూడు గంటలకే సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రయత్నం చేశారు. అయితే సభ కోసం ప్రజలు రావడానికి ఆసక్తి చూపలేదు.. వరంగల్ పశ్చిమ టీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయభాస్కర్, ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేశారు.
పోలీసులు మూసిన గేట్లను తెరిచి ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ వరంగల్ - హైదరాబాద్ ప్రధాన రహదారి మీద ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మెయిన్ గేట్, రోహిణి ఆస్పత్రి పరిసరాల్లోనే జనం సేద తీరారు. సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలు సైతం కళాకారులు పాటలు పాడుతున్నపుడు మాత్రమే ఆసక్తి కనబరిచారు. నేతలు మాట్లాడడం మొదలు పెట్టగానే సభా ప్రాంగణం నుంచి లేచి వెళ్ళడానికి ప్రయత్నించారు. దీన్ని గమనించిన నేతలు మరోసారి కళాకారుల ఆట- పాట కొనసాగించారు. కాస్తా ఆలస్యంగా వచ్చిన జానపద గాయకురాలు మంగ్లీ తన ఆటా- పాటలతో సభను ఆదుకున్నది. పాటలు పాడుతూ ఉత్సాహపరచడంతో జనం వెళ్లిపోకుండా ఉన్నారు.
రాత్రి 7.10 గంటలకు వేదికపైకి కేసీఆర్ చేరుకున్నారు. సభ ఆలస్యం అయినా జనం రాలేదు. ఉన్న జనం కాస్త, సభ లేట్ కావటంతో జనం తిరుగుముఖం పట్టారు. దీంతో సీఎం మాట్లాడుతున్న సమయంలో సభా ప్రాంగణంలో కుర్చీలుగా ఖాళీగా కనిపించాయి. అక్కడ వచ్చిన ప్రజలకు తాను చేసిన పనులు వివరించారు కేసీఆర్, రైతుల కోసం రైతు భీమా, రైతుబంధు పథకం తీసుకొచ్చామని తెలిపారు. నెల రోజుల్లో మిషన్‌భగీరథ పనులు పూర్తవుతాయని కేసీఆర్ వెల్లడించారు. అలాగే డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా త్వరలోనే కట్టేస్తాం అని చెప్పి, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే సభ లేట్ అవ్వటంతోనే, ప్రజలు లేరని, తెరాస వర్గాలు సమర్ధించుకున్నాయి.