ఏపీలో జగన్ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్లేనని.. వైసీపీ అభ్యర్థి గెలిస్తే ఆం ధ్రుల ఆత్మగౌరవం పోయినట్లేనని జనసేనాధిపతి పవన్ క ల్యాణ్ అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంటే వైసీపీ అధినేత జగన్ ఒక్క మాట కూడా అనకపోవడం ఆశ్చర్యంగా ఉందని ధ్వజమెత్తారు. కృష్ణాజిల్లా మైలవరం, నూజివీడు, విజయవాడల్లో శనివారం ప్రచార సభల్లో పాల్గొన్నారు. ‘ఆంధ్రా నాయకులెవ్వరూ తెలంగాణకు రాకూడదుగానీ.. తెలంగాణ నాయకులు వచ్చి ఆంధ్రాలో చేయొచ్చా వైసీపీ ద్వారా? నాకు నచ్చలేదా మాట. మీకు నచ్చిందామ్మా? వైసీపీ నాయకులు అలా చెయ్యొచ్చా?’ అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. ఏపీలో తెలంగాణ నేతల పెత్తనం ఏమిటని నిలదీశారు. ‘ఇక్క డ వైసీపీ అభ్యర్థి గెలిస్తే.. అక్కడ మనల్ని తిట్టిన కేసీఆర్ గెలిచినట్టేనమ్మా. అది మీరు అర్థం చేసుకోవాలి.
‘ఆంధ్రులు ద్రోహులు’ అని తిట్టిన కేసీఆర్ గెలిచినట్టే. వైసీపీ అభ్యర్థి గెలిచా డు ఇక్కడ అంటే.. ఆంధ్రుల ఆత్మగౌరవం పోయినట్టే. గుర్తుపెట్టుకోండి. మనల్నెవరైనా ఛీకొడితే వాళ్లని భుజానికెత్తుకుంటా మా?’ అన్నారు. ‘‘ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా? ఆంధ్రులకు పౌరుషం రాదా? ఆంధ్రులెంతసేపూ బానిసలా మీరు? తిట్టించుకుంటా ఉండాలా మీచేత మేము?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట్లాడితే జగన్‌గారు బీసీ సభలు బీసీ సభలు అంటాడు. తెలంగాణలో ఒక్కదెబ్బకి బీసీల్ని ఓసీల్ని చేశారు. దానికి మీరెళ్లి కేసీఆర్‌గారితో మాట్లాడండి. తీసేయమని అడగండి. మళ్లీ అవి తియ్యరు. ‘నేను ముఖ్యమంత్రి అయ్యాక చేస్తాను’ అంటారు. అప్పుడేముంటుంది? బూడిద ఉంటుంది’ అని మండిపడ్డారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే జనసేన అభ్యర్థుల మీద టీఆర్‌ఎస్ అభ్యర్థుల్ని ఏపీలో పోటీలో పెట్టాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్టు ఇవ్వాలంటే అభ్యర్థుల్ని పోటీలో పెట్టి ఇచ్చుకోవాలి తప్ప జగన్‌కు దొడ్డిదారి మద్దతు ఇస్తే సహించేది లేదన్నారు. జగన్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వబోమని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఆయనకు ఇప్పుడెలా సహకరిస్తున్నారని నిలదీశారు. ఇది ఇలా ఉంటే, తెలంగాణను పాకిస్థాన్ తో పోల్చినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. రాష్ట్ర అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం భీమవరంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం పవన్ కల్యాణ్ పర్యటించిన వేళ, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం పాకిస్థాన్ లా మారిందని నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో లబ్ది కోసం ఆయన తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, మా ముఖ్యమంత్రి కేసీఆర్ పై నోరు పారేసుకుంటున్నారని అడ్వొకేట్ జేఏసీ ఫిర్యాదు చేసింది.