ప్రజలను ఒక ఎమోషన్ లోకి నెట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవటం, మన రాజకీయ నాయకులకు బాగా అలవాటు. ఈ మధ్య రాజకీయాలు చూస్తుంటే, ఇది తప్పు కాదేమో అని కూడా అనిపిస్తుంది. ప్రజలు కూడా మంచి చెడు ఆలోచన చేసే విజ్ఞత ప్రదర్శించక, ఈ ఎమోషన్ కు పడిపోతూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణాలో ఉన్న కేసీఆర్, ఇక్కడ ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఇందులో సిద్దహస్తులు. చంద్రబాబుకు మాత్రం, ఇలాంటివి చేతకాక, రాజకీయంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా కేసీఆర్ , తనకు రాజకీయంగా ఇబ్బంది వస్తుంది అంటే చాలు, ఆంధ్రా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా, చంద్రబాబు తిప్పి కొట్టేవారు. అయితే చంద్రబాబు స్పందన కోసమే ఎదురు చేసే కేసీఆర్, చంద్రబాబుని బూచిగా చూపించటంలో సక్సస్ అయ్యే వారు. ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు, ప్రతిసారి చంద్రబాబుని బూచిగా చూపించి రాజకీయం సక్సస్ అయ్యే వారు. ఇప్పుడు అధికారంలో జగన రెడ్డి ఉండటం, కేసీఆర్ - జగన్ వాటేసుకుని తిరుగుతున్నారు అనే ప్రచారం ప్రజల్లో ఉండటంతో, ఇది తనకి రాజకీయంగా ఏ మాత్రం ఉపయోగ పడదు అనుకున్నారో ఏమో కానీ, దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. అయితే లోపల జగన్ తో ఎలా ఉన్నా, బయటకు మాత్రం తిట్టేస్తున్నారు.
గత వారం రోజులు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీళ్ళు ఎక్కువ తీసుకుని పోతుందని హడావడి చేస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ ని దొంగ అంటున్నారు, రాజశేఖర్ రెడ్డిని రాక్షసుడు అంటున్నారు. అయినా జగన్ వైపు నుంచి స్పందన మాత్రం లేదు. ఇవన్నీ చూస్తుంటే, మ్యాచ్ ఫిక్సింగ్ లాగా కనిపిస్తుంది. అయితే జగన్ స్పందించినా స్పందించిక పోయినా, పెద్దగా లాభం లేదు కానీ, చంద్రబాబు స్పందించాలని ఇరువురు నేతలు కోరుకుంటున్నారు. చంద్రబాబు తెలంగాణాకు వ్యతిరేకంగా స్పందిస్తే, మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టవచ్చని కేసీఆర్ ఆలోచన. ఇక జగన్ ఏమో, చంద్రబాబు ఈ విషయం పై స్పందించాలి అంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ గేమ్ అంతా అర్ధమైన చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికిప్పుడు గ్రౌండ్ జీరో లో ఈ విషయంలో ఏమి జరగకపోయినా, హడావిడి అంతా ఉత్తుత్తిదే అని, ఏదైనా ఉంటే అది జగన్, కేసిఆర్ చూసుకోవాలనే ధోరణిలో చంద్రబాబు ఉన్నారు. విషయం మరీ ముదిరితే తప్పితే చంద్రబాబు స్పందించే అవకాశమే లేదు.