ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ఇంటర్యూలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తనపై చేసిన విమర్శలకు టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆక్రోశంతో ఏదేదో మాట్లాడుతున్నారని.. మోడీ అనడంపై చంద్రబాబు మండిపడ్డారు. కేసీఆర్ సన్నాసి, గాడు అని తిట్టినా మోడీకి బాధ లేదని.. రాష్ట్రం కోసం మేం నిలదీస్తే తప్పుబడతారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే మోదీకి ఎందుకు సంబరం అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ గెలిచిందని కేవలం ఒక సీటు మాత్రమేనని మోదీ గుర్తించుకోవాలన్నారు. ప్రధాని, అమిత్ షా, ముగ్గురు ముఖ్యమంత్రులు, అనేక మంది కేంద్ర మంత్రులు ప్రచారం చేసినా ఒక్క సీటు మాత్రమే గెలిచిందని చంద్రబాబు చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తానన్న ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుంది? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీ కలిసి ప్రమోట్ చేస్తున్నదే ఈ ఫెడరల్ ఫ్రంట్ అని అనుమానం వ్యక్తం చేశారు. వాళ్లకు లాభం చేకూరుతుందనే దీన్ని ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ లో ఉంటున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ చెప్పలేదని, ఆ పార్టీ ప్రకటించకపోయినప్పటికీ ఈ విషయమై కేంద్రం తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు.
ఏపీ ప్రజల్ని రెచ్చగొట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ... ఏపీ మీడియాలో పెద్దఎత్తున ప్రకటనలు ఇచ్చి మన ప్రభుత్వాన్ని రెచ్చగొట్టాలని, అవమానించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో బలహీనమైన ప్రభుత్వం ఉంటే వాళ్లు పనిచేయకపోయినా గొప్పగా చెప్పుకోవచ్చని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు చెప్పినట్టు వినే ప్రభుత్వం రావాలని భావిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఏపీలో 10.52 శాతం వృద్ధిరేటు ఉంటే..తెలంగాణలో 9.7శాతమే ఉందన్నారు. నాలుగేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి రెట్టింపు అయిందని చంద్రబాబు చెప్పారు. ఆర్థికరంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు.. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ఇంతవరకు జరగలేదన్నారు. ఏపీని కేంద్రం అణగదొక్కడానికి ప్రయత్నించడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు.