తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఏపీ సచివాలయ భవనాలు, ఇతర హెచ్‌వోడీ భవనాలపై చర్చించినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం ఉపయోగించని భవనాలను తెలంగాణకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు కేసీఆర్ విన్నవించారు. గతంలో చేసిన కేబినెట్ తీర్మానం, ఏపీకి ఇచ్చే ప్రతిపాదనల గురించి కేసీఆర్ గవర్నర్‌కు వివరించారు. ఏపీలో ప్రభుత్వం మారడం, జగన్ సీఎం కావడంతో మరోమారు ఈ అంశం తెరపెకొచ్చింది. ఏపీ ప్రభుత్వం వినియోగించని భవనాలను వెనక్కి ఇవ్వాలని కేసీఆర్ గవర్నర్‌ను కోరారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు హైదరాబాద్‌లోని సచివాలయ భవనాలను ఉమ్మడిగా వినియోగించుకోవాలనే నిబంధన ఉంది.
అయితే.. అమరావతి నుంచే పూర్తి స్థాయి పరిపాలన సాగుతుండటంతో హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించే అంశం మరోసారి చర్చకొచ్చింది. ఏపీ విభజన అనంతరం సచివాలయ భవనాన్ని ఏపీ, తెలంగాణకు పంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు ఏ,బీ,సీ,డీ బ్లాకులను కేంద్రం కేటాయించింది. ఏపీకి హెచ్, నార్త్ హెచ్,జె,కె,ఎల్ బ్లాకులను కేటాయించారు. అయితే.. ఏపీ పాలన అమరావతి నుంచే జరుగుతుండటంతో సచివాలయంలో అధికారులు, ఉద్యోగులు వెలగపూడికి తరలివెళ్లారు. కొంతమంది సిబ్బంది మాత్రమే హైదరాబాద్‌లోని ఏపీ సెక్రటేరియట్‌కు పరిమితయ్యారు.