సాగర్ జలాలపై తెలంగాణ ప్రభుత్వం కన్నేసింది. ఈ జలాల నియంత్రణను సొంతం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నది. సాగర్ జలాశయ నిర్వాహణను కొట్టేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. కృష్ణా జలాల ట్రిబ్యూనల్ వద్ద తెలంగాణ మొండి వాదనను వినిపిస్తోంది. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రు ప్రాజెక్టులకు కృష్ణా జలాలు ఇవ్వటాన్ని కూడా ఆ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. పట్టిసీమ ద్వారా సరఫరా అవుతున్న గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటున్నందున కృష్ణా జలాల్లో అధిక వాటా తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా పావులు కదుపుతున్నది. నాగార్జున సాగర్ కుడి కాలువ రైతుల ప్రయోజనాలను గండి కొట్టే విధంగా ఆ ప్రభుత్వ చర్యలున్నాయి. ఇదే జరిగితే సాగర్ కుడి కాలువ పరిధిలో సాగు నీరు కష్టమే. ఆయకట్టు అన్నదాతలు మేల్కోక పోతే భవిష్యత్ అంధకారమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.60 లక్షల ఎకరాలకు నాగార్జున సాగర్ జలాశయం నుంచి కుడి కాలువ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. 132 టీఎంసీల నీటి కేటాయింపులు కుడి కాలువకు గతంలో జరిగింది. ఈ స్థాయిలో గత ఐదేళ్లుగా నీటి సరఫరా జరిగిన దాఖలాలు లేవు. వరుసగా మూడేళ్ళు తాగు నీటి సంక్షోభాన్ని అన్నదాతలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం వరి సాగుకు ఎట్టకేలకు నీటి సరఫరా చేసింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షపాతం తక్కువగా నమోదవుతుండటంతో వరద నీటి ప్రవాహం తగ్గి పోతున్నది. మూడేళ్ల అనంతరం గత ఏడాది ప్రకృతి కరుణించటంతో సాగర్ కుడి కాలువకు నీటి సరఫరా జరిగింది. లక్షలాది మంది రైతులు కుడి కాలువ సాగు నీటిపై ఆధారపడి జీవిస్తున్నారు. కృష్ణా జలాల ట్రిబ్యూనల్ వద్ద తెలంగాణ మొండి వాదనను వినిస్తూ సాగర్ జలాలను అక్రమంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నది. ట్రిబ్యూనల్‌పై కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ట్రిబ్యూనల్ తెలంగాణ ప్రభుత్వ డిమాండ్లను అంగీకరిస్తే సాగర్ ఆయకట్టు ఎడారిగా మారుతుంది.
తెలంగాణ మొండి వాదనను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నది. పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు వినియోగిస్తూ రాయలసీమకు శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఈ ఏడాది సుమారు 130 టీఎంసీల నీటిని సరఫరా చేసిన విషయం తెలిసిందే. పోతిరెడ్డిపాడుకు కృష్ణా జలాలను నిలిపి వేయాలని తెలంగాణ వాదిస్తున్నది. అయితే పట్టిసీమ నీటిని కృష్ణాడెల్టాకు వినియోగించుకుంటూ ఈ వాటా జలాలను రాయలసీమకు సరఫరా చేస్తున్నట్టు మన ప్రభుత్వం వివరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి సాకారం లేక పోవటంతో ట్రిబ్యూనల్ మన ప్రభుత్వ వాదనకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు కన్పించటం లేదు. ఉద్యమాల ద్వారానే సాగర్ జలాలను పరిరక్షించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. సీఎం చంద్రబాబు కుడి కాలువ ఆయకట్టు ప్రయోజనాలను కాపాడటంతో పాటు రాయలసీమకు నీరు ఇచ్చి తీరుతానని, తెలంగాణ చర్యలను అడ్డుకుంటానని ఎన్నికల బహిరంగ సభల్లో ప్రకటిస్తున్నారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి మిన్న అని సీఎం చెపుతున్నారు.