‘‘కేసీఆర్.. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతంటున్నారు. ధైర్యముంటే మంగళవారం సాయంత్రంలోగా దీనిమీద దిల్లీకి లేఖ రాయండి. పోలవరాన్ని అడ్డుకునేందుకు వేసిన కేసులు వెనక్కి తీసుకోండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆస్తుల్లో 58 శాతం వాటాలు పంచండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు. వైకాపాకు ఓటేస్తే అది నేరుగా మోదీకి వెళుతుందని, మోదీ వస్తే.. మరణశాసనాన్ని రాసుకున్నట్టేనని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా తిరువూరు, పామర్రు, పెడన, మచిలీపట్నంలలో సోమవారం నిర్వహించిన రోడ్‌షో, బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు కచ్చితంగా మద్దతిస్తామని సోమవారం వికారాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ప్రకటించారు.
చంద్రబాబుకు తెలివి లేదని వ్యాఖ్యానించారు. దీనిపై కృష్ణా జిల్లా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ‘కోడికత్తి పార్టీతో కలిసి రాష్ట్రంలో కుట్ర చేస్తున్న కేసీఆర్‌ను వారం రోజులుగా విమర్శిస్తున్నా. ఆయన నాపై పెత్తనం చేయాలని చూస్తున్నారు. నేనేమైనా కోడికత్తినా పెత్తనం చేయడానికి. కేసీఆర్ ఖబడ్దార్. జీవితమంతా అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు. మా ఎమ్మెల్యేలను కొనుక్కుని.. ఇప్పుడేదో మహానాయకుడిలా మాట్లాడుతున్నారు. ఆంధ్రావాళ్లు తెలంగాణ ద్రోహులు, పనికిరాని దద్దమ్మలు, సన్నాసులంటూ దారుణంగా తిట్టిన కేసీఆర్.. ఇప్పుడేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాక్కూడా తెలివి లేదంటున్నారు’ అని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డం కాదని చెబుతున్న కేసీఆర్.. సుప్రీం కోర్టులో కేసులు ఎందుకు వేశారో చెప్పాలని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతామని కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవినేని మంగళవారం మీడియాతో మాట్లాడారు. అప్పుడు పోలవరంపై కేసులు వేసి.. ఇప్పుడేమో అడ్డం కాదని చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌వి అన్నీ బూటకపు హామీలేనన్నారు. దళితుడిని సీఎం చేస్తాననడం కూడా ఇలాంటిదేనని ఎద్దేవాచేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తుందా?అని ప్రశ్నించారు. 2019 జులై నాటికి గ్రావిటీతో నీరిచ్చేలా చేసిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. అలాంటిది పోలవరం పునాదులే దాటలేదని జగన్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. జగన్ తప్ప లక్షలాది మంది పోలవరం ప్రాజెక్టు చూసి సంబరపడుతున్నారని చెప్పారు. వెయ్యి కోట్ల రూపాయలకు అమ్ముడిపోయి.. కేసీఆర్ చెప్పింది జగన్ చేస్తున్నారని దేవినేని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు సామంతుడిగా మారారని ఎద్దేవాచేశారు.