ఏమైందో ఏమో కాని, ప్రేమికుల దినోత్సవం రోజు, అమరావతిలో కలుద్దమనుకున్న కొత్త ప్రేమికులు ఇద్దరూ అమరావతి రావటం లేదు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి రేపు మంగళగిరిలో జరగాల్సిన తన గృహప్రవేశం వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. కారణం ఏంటో తెలియదు కాని, కుటుంబ పరమైన సమస్యలు అంటూ వాయిదా వేసారు. అయితే, ఈ వార్తలు వచ్చిన మరుసటి రోజే, ఇప్పుడు కేసీఆర్ పర్యటన కూడా వాయిదా పడింది. రేపు జరగాల్సిన కేసీఆర్ విశాఖ పర్యటన రద్దు అయింది. ముందుగా అనుకున్న ప్రకారం గురువారం విశాఖ శారద పీఠంలో నిర్వహించనున్న రాజశ్యామల యాగానికి సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది.
అయితే ఈ పర్యటన రద్దు చేసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ తరఫున రాజశ్యామల యాగానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఎందుకు రద్దు చేసుకున్నారు అనే విషయం మాత్రం, బయటకు చెప్పలేదు. మరో పక్క,
వైసీపీ అధినేత జగన్ అమరావతిలో నిర్మించిన కొత్త ఇల్లు ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 14న గృహప్రవేశం జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు వైసీపీ రాజకీయ వ్యవహరాల కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమం మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని సుబ్బారెడ్డి వివరించారు.
జగన్ తన గృహప్రవేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సైతం ఆహ్వానించారు. అదే రోజు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలకు కేసీఆర్ హాజరుకానున్నారు. అయితే ముందు జగన్ వాయిదా వెయ్యటం, తరువాత కేసీఆర్ రద్దు చేసుకోవటం, ఇవన్నీ చూస్తుంటే, రాజకీయ కారణాలతోనే రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ - జగన్ తో కలుస్తున్నారు అనే వార్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా నెగటివ్ ఇంపాక్ట్ వచ్చింది. జగన్ చేపించిన సర్వేల్లో కూడా ఇదే అభిప్రాయం రావటంతో, జగన్ నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు. అసలైతే కేటీఆర్ ని కలిసిన తరువాత, వెంటనే కేసీఆర్ ను కలవాల్సి ఉన్నా, ఏపిలో ప్రజలు ఎదురు తిరగటంతో, ఈ అభిప్రాయం మార్చుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏపి పర్యటన కూడా అందుకే వాయిదా పడిందనే అభిప్రాయం వస్తుంది.