జగన్, కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు. కేసీఆర్ తీరు మారకపోతే హైదరాబాద్‌లోనే ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్ధులను టీఆర్ఎస్ బెదిరిస్తోందన్న ఆయన.. కేసీఆర్ సహకారంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ విర్రవీగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తీరు మార్చుకోవాలని.. హైదరాబాద్‌లో నిరసన చేసే పరిస్థితులు తెచ్చుకోవద్దుని హితవు పలికారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేలా కేసీఆర్ తీరు ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు అతి పెద్ద సమస్య జగనేనన్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి తుఫాన్‌లు, ఆర్ధిక కష్టాల కంటే జగనే పెద్ద సమస్యన్నారు. ఏపీలో లక్షల సంఖ్యలో ఫేక్ ఫాం-7 దరఖాస్తులు పంపిన వాళ్లపై కేసులు పెట్టాలన్నారు. 85 శాతం ఫాం-7 దరఖాస్తులు బోగస్ అని ఈసీ తేల్చిందని గుర్తు చేశారు. టీడీపీ కుటుంబాన్ని వీడి వెళ్లడానికి ఎవ్వరికీ ఇష్టం ఉండదని కానీ, బెదిరింపుల కారణంగానే కొందరు వైసీపీలోకి వెళ్లారని చెప్పారు. ఎవరైనా అతితెలివి ప్రదర్శిస్తే దండం పెట్టడం మినహా మరేం చేయలేనన్నారు బాబు. కాపులకు ఏమీ చేయలేనని చెప్పిన జగన్ ఇప్పుడు హామీలిస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. టీడీపీ బూత్ కమిటీ కన్వీనర్లు ఈ 3 వారాలు సమర్థంగా పనిచేయాలని, వైసీపీ ప్రలోభాలను ఆధారాలతో సహా బయటపెట్టాలని కోరారు.
తెలుగుదేశం మంచి స్వింగ్‌లో ఉందన్నారు. కాపు రిజర్వేషన్లు తన పరిధిలో లేదని వ్యాఖ్యానించిన జగన్ మళ్లీ న్యాయం చేస్తానంటూ నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. జగన్‌ను నేరస్థుడిలా కాకుండా ఇక్కడ రాజకీయ నేతలా చలామణీ అవుతున్నారని దుయ్యబట్టారు. జగన్ ఓ అరాచక శక్తి అనడానికి అఫిడవిట్‌లో పేర్కొన్న కేసులే నిదర్శనమన్నారు. 48 పేజీల్లో 31 కేసులు జగన్ నేరచరిత్రకు రుజువులేనని.. దేశంలో ఎవరి అఫిడవిట్‌లోనూ ఇన్ని కేసులు లేవని చెప్పారు. చిన్నాన్న హత్య విషయంలోనూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడడం నీచమని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తికి ఎవరైనా ఓటేస్తారా అని ప్రశ్నించారు. అరాచకాల పార్టీకి ఎవరూ ఓటెయ్యకూడదన్నారు. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐలో తొలిపాఠం జగన్ లాంటి వాళ్ల గురించే ఉంటుందని.. ఇలాంటి నేరాల నిరోధంపై అక్కడ శిక్షణ ఇస్తారని చంద్రబాబు తెలిపారు.