ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది... ఈ రోజు ఉదయం ఢిల్లీ సియం అరవింద్ కేజ్రీవాల్, స్వయంగా ఆంధ్రా భవన్ కు వచ్చి చంద్రబాబుని కలిసారు... ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం వివరించారు, అదే విధంగా తమ పోరాటానికి మద్దతు తెలిపినందుకు కేజ్రివాల్ కు ధన్యవాదాలు తెలిపారు... వీరి భేటీ దాదాపు గంట వరకు సాగింది... కేజ్రివాల్ ఆంధ్రా భవన్ లోనే బ్రేక్ ఫాస్ట్ చేసారని, పలు అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం... మరోసారి ఢిల్లీ వస్తానని, అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుందామని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది..
మోదీ సర్కార్‌ఫై కేజ్రీవాల్ తొలి నుంచీ వ్యతిరేక భావనతోనే ఉన్నారు. రాష్ట్రాల హక్కులు, అధికారాలు, నిధుల విషయంలో కేంద్రం తీరుపై ఆయన తరుచూ మండిపడుతుంటారు. అయితే చంద్రబాబు ఎన్డీయే కూటమిలో ఉన్నంత కాలం కేజ్రీవాల్ ఆయనతో ఎన్నడూ మాట్లాడింది లేదు. కానీ ఇటీవల ఎన్డీయే కూటమి నుంచి తెదేపా వైదొలగడం, ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలపై కేంద్రంతో పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్.. చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేజ్రీవాల్‌లో భేటీ అనంతరం మరికొందరు నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
భేటీ ముగిసిన తరువాత, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు, రాజ్యసభ బయట, లోపల తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిర్వహిస్తున్న ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు ఇస్తామన్నారని పేర్కొన్నారు. అలాగే తమ పార్టీ అధినేత చంద్రబాబును అకాలీదళ్ నేత సుఖబీర్‌సింగ్ బాదల్ కలుస్తారని, మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు మీడియాతో మాట్లాడతారని సీఎం రమేష్ తెలిపారు. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు, ఇప్పటివరకూ నెరవేర్చిన హామీలు, రాష్ట్రానికి ఇంకా దక్కాల్సిన ప్రయోజనాలపై చంద్రబాబు మీడియాకు సమగ్రంగా వివరించనున్నారు.