ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికలకు నెల రోజులు ముందు, జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాలను ఊపేసింది. జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేక కేసు కావటంతో, పెద్ద సంచలనం అయ్యింది. అయితే ఇది చేసింది చంద్రబాబు అంటూ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పటం మొదలు పెట్టారు. అయితే అప్పట్లో తెలుగుదేశం అధికారంలో ఉండటంతో, అప్పటికే జరిగిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో దొరికిన కొన్ని ఆధారాలతో, ఇది జగన్ చేపించారు అంటూ తెలుగుదేశం కూడా ఎదురు దాడి చేయటంతో, ఎన్నికల ప్రచారం అయ్యే వరకు వివేక కేసు గురించి మాట్లాడకుండా, జగన్ హైకోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అయితే ఆ సమయంలో సిబిఐ విచారణ కోరిన జగన్, తాను ఎన్నికల్లో గెలవగానే, దీంట్లో సిబిఐ విచారణ అవసరం లేదని పిటీషన్ వెనక్కు తీసుకోవటం, మరో సంచలనం. అయితే వివేక కూతురు మాత్రం వదల్లేదు. హైకోర్టుకు వెళ్ళింది. సిబిఐ విచారణ సాధించుకుని వచ్చారు. సిబిఐ అధికారులు రెండు విడతలుగా ఈ కేసు పై విచారణ కూడా చేసారు. కొంత మంది ప్రముఖల పాత్ర పై స్పష్టమైన ఆధారాలు లభించినట్టు కూడా తెలిసింది. అయితే ఎందుకో కానీ సిబిఐ గత రెండు మూడు నెలలుగా ఈ కేసు విషయంలో మళ్ళీ మూడో విడత విచారణ మొదలు పెట్టలేదు.
ఇది ఇలా ఉంటే, ఇప్పుడు వివేక కేసు విషయంలో మరో సంచలనం బయటకు వచ్చే అవకాసం కనిపిస్తుంది. వివేక కేసులో అతి పెద్ద కుట్ర కోణం దాగి ఉందని, తన వద్ద దీనికి సంబంధించి స్పష్టమైన సమాచారం ఉందని, దీని పై త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి, అన్ని విషయాలు ప్రజలకు తెలిసేలా చెప్తానని, కేరళకు చెందిన ప్రముఖ హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పటం, ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే వివేక కూతురు, సునితా రెడ్డితో కూడా ఈయన భేటీ అయ్యారు. ఆయనే ఈ విషయం మీడియాకు చెప్పారు. మూడు రోజులు క్రితం ఆమెతో కలిసి, ఈ కేసు విషయం పై ఆమెతో చర్చించినట్టు, సిబిఐ విచారణలో వారికి ఎలా సహకరించాలి, ఎలాంటి ఆధారాలు వారికి ఇవ్వాలి అనే విషయం పై ఆమెతో చర్చించినట్టు చెప్పారు. ఈయన కేరళలో జరిగిన సిస్టర్ అభయ కేసులో పోరాడి సిబిఐకి అనేక సాక్ష్యాలు ఇవ్వటంతో సక్సెస్ అయ్యారనే పేరు ఉంది. చివరకు ఈయన చెప్పిన విషయాలనే సిబిఐ కోర్టు నిర్ధారించింది. మరి వివేక కేసులో ఎలాంటి సంచలనాలు బయటకు వస్తాయో చూడాలి.