ఈ నెల 23న ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల తరపున బరిలో నిలిచిన నేతలల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓటమి పాలవుతారోనన్న దానిపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల బీపీ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయేమోనని భావించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిని మీడియా కలిసింది. గెలుపుపై ధీమాతో ఉన్న కేశినేని నాని బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఆరా తీసింది. బీపీ మిషన్ తో చెక్ చేసింది. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉన్న నాని బీపీ నార్మల్ గానే ఉంది. అదే విధంగా, తన గెలుపుపై ధీమాతో ఉన్న మైలవరం టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా బీపీ లెవెల్స్ చెక్ చేయగా నార్మల్ గానే ఉన్నాయి.
ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ, విజయవాడ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి, కనీవినీ ఎరుగని మెజార్టీతో, తాను విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ల కాలాన్ని ఒక్క నిమిషం కూడా వృథా కానీయకుండా ప్రజల కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కష్టపడ్డానని చెప్పారు. తన జీవిత చరిత్ర తెరిచిన పుస్తకమని అందులో ప్రజాసేవ తప్ప ఎలాంటి మోసాలు గానీ నేరాలు గానీ ఉండవన్నారు. 2014 ఎన్నికల్లో ఎలా అయితే ఓటమి పాలయ్యారు రాబోయే ఎన్నికల్లో కూడా తన చేతిలో వైసీపీ అభ్యర్థి పీవీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు.
గత ఎన్నికల్లో తనపై ఎమ్మార్ కేసులో కోర్టులో జైలుకెళ్లిన వ్యక్తిని తనపై నిలబెట్టారని అతనిని విజయవాడ ప్రజలు తరిమితరిమికొట్టారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా పీవీపీని అలాగే తరిమికొడతారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో 3లక్షల ఓట్లతో గెలవబోతున్నానని గెలిచి చరిత్ర సృష్టించబోతున్నట్లు స్పష్టం చేశారు కేశినేని నాని. పీవీపీ అంతర్జాతీయ స్థాయిలో స్కాములు చేసిన వ్యక్తి అని ఆరోపించారు. సెబీ కేసుల్లో ఇరుక్కుని దాక్కుంటున్న వ్యక్తి అంటూ ఆరోపించారు. జగన్ డబ్బును హవాలా చేసింది కూడా ఆయనేనంటూ ఆరోపించారు. వైఎస్ జగన్ నైజం, పీవీపీ నైజం ఒక్కటేనని ఆరోపించారు.