ఉండవల్లి దగ్గర చంద్రబాబు ప్రభుత్వ హయాంలో, ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చిపడేయాని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. అది అక్రమ కట్టడమని, అవినీతి డబ్బులతో కట్టిన కట్టడమని ఆరోపించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో కట్టిన భవనం, అవినీతి కట్టడం ఎలా అవుతుందో జగన్ కే తెలియాలి. అయితే జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ కూల్చివేత నిర్ణయం పై, చాలా వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు మీద ఉన్న కక్షతో, ప్రభుత్వ బిల్డింగ్ కూల్చివేయటం దారుణమని అంటున్నారు. ఇదే విషయం పై విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఫేస్బుక్ లో స్పందించారు. మొన్నటి దాక, తెలుగుదేశంలోని కొంత మంది నేతలను, తన అసంతృప్తిని పోస్ట్ చేస్తూ, వార్తల్లో నిలిచిన నాని, ఇప్పుడు జగన్ చేసిన పనిని టార్గెట్ చేస్తూ, ప్రజా వేదిక కూల్చివేత పై పోస్ట్ పెట్టారు. ప్రజా వేదిక తొలగిస్తే, దానికి రెండు రకాల ఇబ్బందులు వస్తాయని, అవి తెలుసుకుని ముందుకు వెళ్ళాలని నాని తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు.
ఇది కేశినేని నాని చేసిన ఫేస్బుక్ పోస్ట్ ‘‘ప్రజావేదిక అక్రమ కట్టడమో, సక్రమ కట్టడమోపక్కన పెడితే, అది ప్రజా ధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనం. ప్రజావేదిక అక్రమ కట్టడం అని తొలగించె ముందు, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలన్నీ ముందుగా తొలగించి, తరువాత ప్రజా వేదిక ను చివర్లో తొలగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రజా వేదికను ఉన్న పళంగా తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రెండు విధాలుగా నష్టం జరుగుతుంది. ఒకటి, అది ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చి వేస్తే, దాని నిర్మాణానికి పెట్టిన ఖర్చు వృథా అవుతుంది. రెండోది, ప్రస్తుతం అంత పెద్ద హాల్ ప్రభుత్వానికి లేదు. ఇలాంటి మరో వేదిక కట్టాలంటే టైం పడుతుంది. అప్పటి వరకు ప్రభుత్వ సమావేశాలు నిర్వహించాలి అంటే, ప్రైవేటు వేదికలకు డబ్బు ఖర్చు పెట్టాలి. ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈలోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ప్రజావేదిక తొలగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం’’ అని కేశినేని పోస్ట్ చేసారు.