విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం, పార్లమెంట్‌లో ఇచ్చిన హామీల అమలు, కేంద్ర సాయంపై చర్చించేందుకు అఖిలసంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సమావేశమైంది. సచివాలయంలోని బ్లాక్-1లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసే పోరాటానికి మద్దతిస్తామని అఖిలసంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. దేశాన్ని కదిలించగల అనుభవం, సమర్ధత ఉన్న నాయకుడు చంద్రబాబు ఈ పోరాటానికి దశ,దిశ నిర్దేశించాలని అఖిలసంఘాలు సూచించాయి.
రానున్న 10 రోజులలో రాష్ట్ర ప్రజలను చైతన్యవంతులను చేసి పోరాటానికి సమాయత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.. రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్న రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ నల్లబ్యాడ్జీలు ధరించి మన నిరసన తెలియజేయాలని నిర్ణయించారు.... మరిన్ని గంటలు అదనంగా పనిచేయడం ద్వారా జపాన్ తరహా నిరసన తెలియచేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. రాజకీయాలకు అతీతంగా జరిపే శాంతియుత పోరాటంలో ఈ రోజు జరిపిన సమావేశానికి గైర్హాజరైన రాజకీయ పక్షాలను మరోసారి ఆహ్వానించాలని, వచ్చే సమావేశంలో విద్యార్థులు, విద్యుత్, ఇతర సంఘాలను కూడా భాగస్వాముల్ని చేయాలని నిర్ణయించారు....
సంయమనంతో చేయాల్సిన ఉద్యమం అయినందున అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా అవాంచనీయ ఘటనలకు తావివ్వకుండా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు... ముఖ్యంగా తమ భవిష్యత్ దెబ్బతింటుందని ప్రజలలో ఎక్కడా సందేహం రాకుండా ఈ ఉద్యమాన్ని శాంతియుత పంథాలో నడపాలని పిలుపిచ్చారు... జాతీయస్థాయిలో ఇఫ్పటికే దాదాపు అన్ని రాజకీయపక్షాలు ఏపీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు... 2,3 తేదీలలో ఢిల్లీ వెళ్లి అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులను కలుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.