రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో భారతదేశంలోనే తొలిసారిగా దక్షిణ కొరియా కార్ల దిగ్గజం ఏర్పాటు చేసి కియా కంపెనీ జిల్లా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి కాబోతోంది. కియా మోటార్స్ నుండి తొలి కారు రేపు రోడ్డు మీదకు రానుంది. ఈ కంపెనీ ఇండియాలో తయారుచేసిన తన తొలికారును ఈ నెల 29వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. అనంతపురం జిల్లా కార్మికుల చేతుల మీదుగా బిగించిన తొలి కారును చంద్రబాబు విడుదల చేసి, డ్రైవ్ చేయనున్నారు. ఇప్పటికే పరిశ్రమలో ఉన్న ట్రాక్ పై ట్రయల్ రన్ ను కూడా నిర్వహించిన సిబ్బంది తొలికారు విడుదల కోసం వేచిచూస్తున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త మోడల్ కారును విడుదల చేసేలా అత్యాధునిక రోబోటిక్ యంత్రాలను పరిశ్రమలో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ అనంతపురం జిల్లా అభివృద్ధిలో కీలకంగా మారింది.
జిల్లాలోని అమ్మవారుపల్లిలో 555 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో కియా మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేశారు. దక్షిణ కొరియాలోని సియోల్ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన కియా 1954 నుంచి వాణిజ్యపరమైన కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టును అమ్మవారుపల్లి వద్ద ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ మార్చి నుంచి వాణిజ్య పరంగా ఉత్పత్తికి శ్రీకారం చుట్టి, ఆక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో కార్లను ఉత్పత్తి చేయబోతోంది. సాంకేతికంగా కార్ల తయారీకి కియా ఇండియా యూనిట్ సిద్ధం అవుతుండటంతో ట్రయల్ ప్రొడక్షన్లో తాలికారును సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.
కాగా 2017 ఏప్రిల్ 20వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కియా(జీఏ) మోటార్స్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. ఈ కంపెనీ ఏర్పాటుకు మొత్తం రూ. 15వేల కోట్లు(400 మిలి యన్ డాలర్లు) పెట్టుబడి పెడుతున్నారు. ఈ యూనిట్లో ప్రాథమికంగా ఏడాదికి 3 లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యం కాగా, అన్ని హంగులూ సమకూర్చుకున్న అనంతరం ఏడాదికి 4 లక్షల కార్ల ఉత్పత్తి స్థాయికి పెంచేందుకు కంపెనీ యాజమాన్యం సిద్ధమవుతోంది. ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా 4వేల శాశ్వత ఉద్యోగాలతో పాటు అదనంగా 7 వేల మందికి టెంప రరీ ఉద్యోగాలు కల్పించనున్నామని సీఎం చంద్రబాబు ఇది వరకే ప్రకటించారు. కాగా స్థానిక జిల్లా వాసులకే 100 శాతం ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు.