అది అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లె గ్రామం! అంతంత మాత్రంగా కురిసే వర్షాలు! అప్పుడప్పుడు మాత్రమే పండే పంటలు! ఎకరం పొలం ధర రెండు లక్షలు పలికితే గొప్ప! ఇప్పుడు... అవే భూములు బంగారంలా మారాయి! ఐదు... పది... ఇరవై ముప్పై దాటి ఎకరం రూ.50 లక్షలకు బేరాలు సాగుతున్నాయి. ఇదంతా... దక్షిణ కొరియాకు చెందిన ‘కియ’ కార్ల కంపెనీ రాక మహిమ! కియతోపాటు... దానికి అనుబంధ పరిశ్రమలు భారీ ఎత్తున తరలి రావడం ఖాయం కావడంతో అనంతపురం జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. అమ్మవారిపల్లె ప్రాంతంలో కియ పరిశ్రమకు 600 ఎకరాలను కేటాయించారు. ‘కియ’ కంపెనీ హ్యుండయ్‌కి మాతృ సంస్థ. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కార్ల కంపెనీ ఇది. కర్ణాటక, తమిళనాడుతో పోటీపడి మరీ ఈ పరిశ్రమను చంద్రబాబు సర్కారు రాష్ట్రానికి రప్పించింది.
కియా కార్ల పరిశ్రమ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.13,500 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్న ఈ పరిశ్రమ వల్ల 20 వేల మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగనుంది. అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమ రావడం ఓ వరమని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. పెనుకొండ మండలం ఎర్రమంచిలో ఏర్పాటవుతున్న కియా పరిశ్రమను గురువారం ఆయన పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 జనవరి 29న ట్రయల్ కారు తయారు చేసి ఇస్తామని కియా ప్రతినిధులు తెలిపారని మంత్రి పేర్కొన్నారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.
ప్రస్తుతం పరిశ్రమలో కారు బాడీ ప్రెస్సింగ్ యూనిట్ పనులు 98.3 శాతం, బాడీ తయారీ యూనిట్ పనులు 99.2శాతం, పెయింటింగ్ యూనిట్ 95 శాతం, ఇంజిన్ యూనిట్ 95శాతం, అసెంబుల్డ్ యూనిట్ 95.8 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. జనవరిలో ముఖ్యమంత్రి మొదటి కారును ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో మెగా పరిశ్రమలే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఓ ఎంఎస్‌ఎంఐ పార్కు (స్మూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇప్పటికే 35 నియోజకవర్గాలను గుర్తించినట్లు వివరించారు.