ప్రముఖ కార్ల దిగ్గజం కియా పరిశ్రమ పనులు వేగం పంజుకున్నాయి. అనంతపురం జిల్లా, పెనుకొండ మండలంలోని అమ్మవారుపల్లి, ఎర్రమించి వద్ద ఐదు దశలుగా చేపడుతున్న భూమి చదును పనులు తుది దశకు వచ్చాయి. 1, 2, 3, 5 దశల్లో పనులు పూర్తి కాగా, నాలుగో దశ కొనసాగు తున్నాయి. ఇప్పటికే కేటాయించిన 582.70 ఎకరాల్లో కియా ప్రధాన పరిశ్రమలో పెయింట్స్ షాపు, బాడీ బిల్లర్ వర్క్ షాప్, ఇంజిన్ ఫుట్ వర్క్స్ షాపు , ఇందనం నిలువ చేయడానికి కూల్ ఫుట్ షాప్, పవర్ ట్రైన్ షాప్, మోడల్ షాప్, అసెంబుల్డ్ షాపు, ఇంటర్నల్ రోడ్స్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
పరిశ్రమ చుట్టూ కెనాల్ టౌన్షిప్, శిక్షణా కేంద్రం పనులు చేపడుతున్నా. వీటిని కొరియా టెక్నికల్ ఇంజీనీర్లు, మేనేజర్ల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గొల్లపల్లి రిజర్వా యర్ నుంచి పరిశ్రమకు అవసరమైన నీటి పైప్ లైన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పరిశ్రమకు అవసరమైన యంత్రాలు, పరికరాలు ఉంచుకోవటానికి 82 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ నిర్మిస్తున్నారు. పనుల పురోగతి పై జిల్లా కలెక్టర్, కియా బృందం, ఏపీఐఐసీ అధికారులు ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నారు.
2019 ద్వితీయార్థం నుంచి భారతీయ మార్కెట్లో కార్ల అమ్మకాలను ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామంలో దాదాపు 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.13వేల కోట్ల పెట్టుబడితో కియా సంస్థ కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. 2018 మార్చి నాటికి ట్రయల్ రన్, 2019 సెప్టెంబరుకల్లా ఉత్పత్తిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.