ప్రాధమిక వైద్యం, కుటుంబ సంక్షేమం, ఏపీ వైద్యవిధాన పరిషత్, ఆయుష్, మందుల నియంత్రణ, గిరిజన సంక్షేమం, సాధికారిత శాఖల మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ బుధవారం ఉదయం సచివాలయంలోని 2వ బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించారు. 15 గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాట్లు మంజూరు చేస్తూ, గిరిజన ప్రాంతాల్లో రూ.213 కోట్ల వ్యయంతో 48 రోడ్లు నిర్మించాలని రోడ్లు భవనాల శాఖకు పంపే ప్రతిపాదనలపై తొలి సంతకాలు చేశారు. తల్లి పరమేశ్వరి, సోదరుడు సందీప్, ఆయా శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి కల్నల్ వి.రాములు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ అరుణ కుమారి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఏపీవివిపీ ప్రత్యేక అధికారి శ్రీదేవి తదితరులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి శ్రావణ్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఇంతటి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, సంక్షేమ పథకాలు చేస్తానన్నారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమపథకాలు అందేందుకు కృషి చేస్తానని చెప్పారు. మంత్రి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పలువురు ప్రముఖులు పాల్గొని శ్రమణ్ ను అభినందించారు. శ్రావణ్‌కుమార్ వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూలో ఇంజినీరింగ్ చదివారు. సివిల్ సర్వీసెస్‌కి ఎంపికవడం ఆయన లక్ష్యం. దాన్ని సాధించేందుకు దిల్లీలో ఉంటూ సివిల్స్ పరీక్షలకు శిక్షణ పొందుతున్నారు. తండ్రి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో... ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు రాజకీయాల్లోకి వస్తున్నారు. శ్రావణ్ 1990 జూన్ 14న జన్మించారు. ఎనిమిదో తరగతి వరకు పెదబయలులోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో చదువుకున్నారు. విశాఖలో ఇంటర్మీడియెట్ చదివారు.