ధవళేశ్వరం బ్యారేజ్‌పై కవాతు చేశాక.. పవన్ చేసిన వ్యాఖ్యలు విశాఖలో అగ్గి రాజేశాయి. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర్రావును మావోయిస్టులు హత్య చేయడాన్ని సమర్థిస్తున్నట్టుగా పవన్ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగంతో సతమతం అవుతున్న యువత.. విప్లవోద్యమాలవైపు ఆకర్షితులు అవుతున్నారంటూ జనసేనాని ధవళేశ్వరం సభలో మాట్లాడారు. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సర్వేశ్వర్రావు భార్య విశాఖపట్నంలో దీక్షకు దిగారు. ఓ ప్రజా ప్రతినిధిని కొందరు హత్య చేస్తే.. దాన్ని ఓ పార్టీ నాయకుడిగా పవన్ ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారామె.
మావోయిస్టులకు అనుకూలంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు నేత మీనాదే ప్రాణమా?..కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలవి ప్రాణాలు కావా? అని ప్రశ్నించారు. నిజాయితీ గల నేతలు చనిపోతే విమర్శించడం తగదని సోమ భార్య హితవు పలికారు. పవన్ కల్యాణ్ ఇలా అనటం మొదటి సారి కాదని, పదే పదే తన భర్త తప్పు చేసినట్టు, చంపిన మావోయిస్టులను వెనకేసుకుని వస్తున్నాడని, నిన్న ఏకంగా పబ్లిక్ మీటింగ్ లో అలా అనటం బాధ వేసింది అన్నారు ఆమె.
నిన్న పవన్ కల్యాణ్ ధవళేశ్వరం బేరేజు వద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ రాజకీయ నేతల అవినీతి వల్లే మావోయిస్టులు పుట్టుకొస్తున్నారని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెదేపాలోకి వెళ్లిన వైకాపా ఎమ్మెల్యేను చంపింది గోదావరి జిల్లా నుంచి నక్సలిజంలోకి వెళ్లిన ఆడపడుచు.. ఆమె ఎందుకు అటువైపు వెళ్లిందో ఆలోచించుకోవాలని పవన్ వ్యాఖ్యానించారు. అయితే, తన భర్త హత్యకు గురై నెల కూడా కాకముందే ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలుచేయడం తమనెంతగానో బాధించిందని .. కిడారి గురించి ప్రజలందరికీ తెలుసని ఆమె తెలిపారు. తమకు ధైర్యం ఇవ్వాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టొద్దని ఆమె కోరారు.