కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ తెదేపాలో చేరనున్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కిశోర్ చంద్రదేవ్ మీడియాతో మాట్లాడుతూ తెదేపాలో చేరికపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని.. త్వరలో తాను తెదేపాలో చేరనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తెదేపా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం భేటీలో ప్రస్తావనకు రాలేదని కిశోర్ చెప్పారు.
ఇటీవల విజయనగరం జిల్లా కురుపాంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు రాజీనామా చేసినట్లు అప్పుడే ప్రకటించారు. దీంతో కిశోర్ చంద్రదేవ్ తెదేపాలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆయనే స్వయంగా ప్రకటించించడంతో ఆ ప్రచారానికి తెరపడినట్లయింది. కిశోర్ చంద్రదేవ్ అరకు పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారన్నదానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కిశోర్ చంద్రదేవ్ మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కలిశారని అన్నారు. ముఖ్యమంత్రి కూడా సంతోషం వ్యక్తం చేశారన్నారు.
కిశోర్ చంద్రదేవ్ మంచి నాయకుడని బుద్దా వెంకన్న కొనియాడారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని, ప్రజల్లోకి వెళ్లాయని, ప్రజలు కూడా టీడీపీవైపే ఉన్నారని సీఎంను కిశోర్ చంద్రదేవ్ ప్రశంసించారు. ఏది ఏమైనా కిశోర్ చంద్రదేవ్ లాంటి వాళ్లు టీడీపీలోకి రావడం సంతోషించదగ్గ విషయమని బుద్దా వెంకన్న అన్నారు. నైతిక విలువలు ఉన్న నాయకుడు టీడీపీలోకి రావడం శుభపరిణామమని అన్నారు. ఇది ఇలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేయనున్న నిరసనకు మద్దతు తెలపనున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై ఎన్డీయేతర పక్షాలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.