గత నాలుగు రోజులుగా కొడాలి నాని హిందూ దేవుళ్ళ పై, అలాగే తిరుమల డిక్లరేషన్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే తాను మాట్లాడిన మాటల పై, ఎంత మంది ఆందోళన చెందినా, నిరసన తెలిపినా మంత్రి కొడాలి నాని మాత్రం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. అయితే ఇన్ని వ్యాఖ్యలు చేసిన నానిని ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎవరూ ఖండించక పోవటం కొసమెరుపు. ఇలా ఈ వివాదాలు కొనసాగుతూ ఉండగానే, కొడాలి నాని, ఈ రోజు తిరుమల చేరుకున్నారు. జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఈ రోజు శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, తెలుగుదేశం పై ఎప్పటిలాగే విరుచుకు పడ్డారు. అయితే ఈ సారి అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఏకంగా ప్రధాని మోడీని కూడా ఈ వివాదంలోకి లాగారు కొడాలి నాని. మీడియాతో మాట్లాడుతూ ఉండగా, ఒక మీడియా ప్రతినిధి, జగన్ ఒక్కరే పట్టు వస్త్రాలు ఇవ్వకూడదు, సతీ సమేతంగా ఇవ్వాలి అని బీజేపీ అంటుందని, ప్రశ్నించారు.
దీని కి సమాధానం ఇచ్చిన నాని, ఇందులోకి ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ సియం యోగి ఆదిత్యనాద్ ని కూడా లాగారు. ప్రధాని మోడీ ఎప్పుడైనా తన భార్యతో కలిసి చేసారు. మొన్న అయోధ్య పూజ చేసారా ? కాబట్టి ఆయన్ను తన భార్యను తీసుకు వచ్చి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి లాగా, కలిసి మళ్ళీ అయోధ్య పూజ చెయ్యమనండి, అలాగే ఉత్తర ప్రదేశ్ సియం యోగి ఏ నాడైనా తన భార్యను తీసుకుని వచ్చారా ? అని కొడాలి నాని ప్రశ్నించారు. ఒక పది మంది కలిసి నన్ను తీసేయమంటే తీసేస్తారా ? నేను ఒక పది మందిని తీసుకుని వెళ్లి అమిత్ షా ను తీసేయమంటే తీసేస్తారా ? అని ప్రశ్నించారు. సోము వీర్రాజు వచ్చిన తరువాత నుంచి, ఆలయాల్లో దాడులు జరుగుతున్నాయని, నేను చెప్తే ఆయన్ను తీసి వేస్తారా ? అని అడిగారు. కాబట్టి బీజేపీ ఇక్కడ నోటాతో పోటీ పడుతుందని, సోము వేర్రాజు ఒక్క శాతం నుంచి, ఒకటిన్నర శాతానికి ఎలా ఎదగాలి అనేది చూసుకుంటే మంచిది అని, వాళ్ళు మాకు సలహాలు ఇచ్చే స్థాయిలో లేరని అన్నారు.