నందివాడ మండలంలో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా రాజకీయంగా పలుమార్పులు చోటు చేసుకున్నాయి. ముదినేపల్లిలో భాగంగా ఉన్న కాలంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ పిన్నమనేని కోటేశ్వరరావు ప్రభావంతో కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ఆధిపత్యం ప్రదర్శించింది. మండలంలో మొత్తం 28748 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల ఓటర్లు అధికం. గుడివాడ నియోజకవర్గంలో చేరిన తొలిసారి 2009లో మండల ఓటర్లు 872 ఓట్ల మెజార్టీతో టీడీపీకే పట్టం కట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 2823 ఓట్ల మెజార్టీ లభించింది. దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధం పెనవేసుకున్న కొంతమంది టీడీపీ నాయకులు కొడాలి నానితో వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీకి మైనస్‌ అయింది. పదేళ్లపాటు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న నాని పార్టీ ఫిరాయింపుతో కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి నాయకత్వ శూన్యత ఏర్పడింది.

game 27032019

కొంత మంది బలమైన నేతలను తనవైపుకు తిప్పుకోవడంతో 2014 ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంత మంది నేతలు టీడీపీలో ఉంటూనే లోపాయికారీగా నాని ప్రలోభాలకు లొంగి వైసీపీకి పనిచేశారు. ఈ కారణాలతో టీడీపీ బలంగా ఉన్న నందివాడలో వైసీపీ పాగా వేసింది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ రంగంలోకి దిగడంతో సీన్‌ రివర్స్‌ అవడం ఖాయమని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మండలంలో త్వరలో నిర్వహించనున్న అవినాష్‌ ప్రచారాన్ని విజయవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన పర్యటన ప్రారంభించక ముందే మండల టీడీపీ నాయకులు ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేయాలని నిబద్ధతతో ఉన్నారు. నాయకులు విబేధాలు వీడి పనిచేస్తుండటంతో ఆధిక్యం సాధిస్తుందనేది శ్రేణుల మాట.

గత ఎన్నికలకు ముందు మండల టీడీపీకి ఇరుసుగా వ్యవహరించిన బీసీ నాయకుడు, మండల పార్టీ అధ్యక్షుడు పల్లపోతు వెంకటకృష్ణ హఠాన్మరణం టీడీపీ వైఫల్యానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గత ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందు మండలంలో కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరావు తన వర్గంతో టీడీపీలో చేరడంతో గ్రామ స్థాయిలో టీడీపీ నాయకుల మధ్య విభాదాలు తెలెత్తాయి. పిన్నమనేని చేరిక టీడీపీకి ప్లస్‌ కావాల్సింది పోయి మైనస్‌గా మారింది. నందివాడ మండల కేంద్రంలో టీడీపీ నేత వేములపల్లి వెంకటేశ్వరరావు(బాబు) అసెంబ్లీ ఎన్నికల నాటికి క్రియశీలంగా లేకపోవడం గత ఎన్నికల్లో ఆ గ్రామంలో టీడీపీకి మైనస్‌ వచ్చింది. తమిరిశ టీడీపీ నాయకుడు, గుడివాడకు చెందిన వైద్యుడు మాగంటి శ్రీనివాస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చురుగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ గ్రామంలోనూ మైనస్‌ వచ్చింది. వీటికి తోడు మండల టీడీపీలో నెలకొన్న గ్రూపు తగాదాలతో క్యాడర్‌ సరిగా పనిచేయకపోవడం కూడా పరాజయానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఆర్థిక, అంగబలాల్లో సమర్థుడైన దేవినేని అవినాష్‌ రంగంలోకి దిగడంతో మండల టీడీపీలో ఉత్సాహం నెలకొంది. టీడీపీని దెబ్బతీయడానికి కొడాలి నాని ఎత్తుగడలు ఈసారి పారే అవకాశాలు ఎంతమాత్రం లేవని పార్టీ కార్యకర్తలంటున్నారు. టీడీపీ పాత నాయకులు, పిన్నమనేని వెంకటేశ్వరావు వర్గం నాయకుల నడుమ అక్కడక్కడా ఉన్న విభేదాలను సర్దుబాటు చేసుకుని సమన్వయంతో పనిచేస్తే మండలంలో టీడీపీ ఆధిక్యం సాధించే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు సైతం గత ఐదేళ్లుగా మండలంపై దృష్టి పెట్టి సిమెంట్‌ రోడ్లు వేయించడం, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేయడంలో చేసిన కృషి గ్రామాల్లో టీడీపీకి సానుకూల పవనాలకు కారణ మవుతోంది.

గతంలో వైసీపీకి వచ్చిన మెజార్టీని అధిగమించి టీడీపీకి మెజార్టీ సాధించే దిశగా నాయకులు పక్కా వ్యూహరచనతో ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఒక పక్క సంస్థాగతంగా టీడీపీ బలంగా ఉండటం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు తమకు లాభిస్తాయని పార్టీ శ్రేణులంటున్నాయి. మండల టీడీపీ అధ్యక్షుడు అరికెపూడి రామశాస్త్రులు, గుడివాడ అర్బన్‌ బ్యాంకు అధ్యక్షుడు పిన్నమనేని బాబ్జీ మండలంలో అవినాష్‌ ప్రచార బాధ్యతలుభుజాన వేసుకుని ఇంటింటికీ తిరుగుతూ టీడీపీని గెలిపించాలని కోరుతున్నారు. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే పంచాయతీలు, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఉండటంతో ప్రతి నాయకుడు మండలంలో టీడీపీకి పూర్వవైభవం సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read