మంత్రి కొడాలి నాని కనుసన్నల్లోనే రూ.4 వేల కోట్ల బియ్యం కుంభకోణం జరిగితే దర్యాప్తు ఏదని టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మట్లాడారు. ఆయన మాటల్లో... జగన్ ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇస్తానని చెప్పి నాసిరకం బియ్యమిస్తూ మోసం చేస్తున్నారు. పేద ప్రజలకిచ్చే బియ్యం విషయంలో కూడా జగన్ ప్రభుత్వం కక్కూర్తికి పాల్పపడుతోంది. రబీ సీజన్‌లో రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకిచ్చి తద్వారా వచ్చే నాణ్యమైన బియ్యాన్ని పేదలకివ్వాల్సివుండగా మంత్రులు కొడాలి నాని, శ్రీరంగనాధరాజు, కార్పొరేషన్ ఛైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డిలు ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొని రూ. 4 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. మళ్లీ అదే బియ్యాన్ని నాసిరకం బియ్యంగా రీసైక్లింగ్ చేసి పేద ప్రజలకు పంపిణీ చేయడం అన్యాయం. కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోని మైలవరంలో ఈ సంఘటన బయటపడింది. ఇందులో జగన్ వాటా ఎంతో తెలపాలి. ప్రజలకందించాల్సిన బియ్యాన్ని పందికొక్కుల్లా మెక్కడం సిగ్గుగా లేదా?. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 60 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ అవినీతికి పాల్పడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి 3 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించిన నాణ్యమైన ధాన్యాన్ని కేజీ 40 రూపాయలకు బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. ఈ అవినీతికి పాల్పడుతున్న మంత్రులను, కార్పొరేషన్ ఛైర్మన్ని బర్తరఫ్ చేయాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. లోకల్ బ్రాండ్లతో తన సొంత ధనాగారాన్ని నింపుకుంటున్న జగన్ ఎక్సైజ్ శాఖ గురించి ఏరోజూ సమీక్ష జరపలేదు.
దళితుల తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడిన సందర్భాలు అసలే లేవు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే పార్థసారధికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదు. అనవసర విమర్శలు మానుకోవాలి. ముదిగొండలో పేద రైతులపై కా-ల్పు-లు జరిపి 7 మందిని చంపించింది వైసీపీ కాదా?. జగన్ రైతు వ్యతిరేకి. జగన్మోహన్ రెడ్డికి బెంగుళూరులో, హైదరాబాద్ లో, పులివెందులలో, ఇడుపులపాయిలో, తాడేపల్లిలో ఇళ్లు ఉన్నాయి గానీ పేద రైతుకు నిలువ నీడ లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడుకు ప్రజలు ప్రతిపక్ష హోదా కల్పించారు కాబట్టి ఆయనకు ప్రభుత్వ అవినీతిని, వైసీపీ నాయకులు చేసే తప్పుల్ని ప్రశ్నించే హక్కుంది. వైసీపీ నాయకులు తప్పుడు ప్రకటనలు మానుకోవాలి. వారు మూడు రాజధానుల కోసం పూటకో మాట మాట్లాడటం మానుకోవాలి. అమరావతి నిర్మాణం చారిత్రాత్మక అవసరం, తెలుగు ప్రజలు ఆత్మగౌరవం కాపాడగలిగేది అమరావతి ఒక్కటే. టీడీపీ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో రైతుల తరపున పోరాటం చేస్తూనే ఉంటాం.