ఒకప్పటి టీడీపీ కంచుకోట గుడివాడలో పార్టీ మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటోంది. టీడీపీ నియోజకవర్గ అభ్యర్థిగా దేవినేని అవినాష్ ఎంపికతోనే కార్యకర్తల్లో జోష్ వచ్చింది. టికెట్ ఖరారు సమయంలో సీఎం చంద్రబాబు చేసిన దిశానిర్దేశంతో నియోజకవర్గ అగ్రనాయకులు రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, యలవర్తి శ్రీనివాసరావు ఏకతాటిపైకి వచ్చి అవినాష్ గెలుపునకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణులు, అవినాష్ రాకతో కదం తొక్కుతున్నాయి. గుడివాడ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో అవినాష్ నామినేషన్‌కు తరలివచ్చిన భారీ జనసందోహమే దీనికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో దేవినేని అవినాష్‌కు యువత, మహిళలు, వృద్ధుల్లో లభిస్తున్న ఆదరణ వైసీపీ శ్రేణులకు గుబులు పుట్టిస్తోంది. గుడివాడ పట్టణం, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత అవినాష్‌తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరుస్తోంది. ప్రచారంలో భాగంగా అవినాష్ ఎక్కడికి వెళ్లినా మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. స్వతహాగా సౌమ్యుడు, వివాదరహితుడైన అవినాష్, వైరిపక్షం నుంచి వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుపోతున్నారు.
ప్రచారపర్వంలో అందరిలో ఒక్కడిగా మమేకమవుతున్న అవినాష్ తీరు ఆకట్టుకుంటోంది. స్థానికుడు కాదనే ప్రత్యర్థుల ఆరోపణలను అవినాష్ బలంగా తిప్పికొడుతున్నారు. స్థానిక సత్యనారాయణపురంలో ఇల్లు తీసుకుని ఉంటున్న ఆయన, తన ఫోన్ నెంబరు, అడ్రస్ చెప్పి ఎవరికీ ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించవచ్చని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. కొడాలి నాని పేరుకు స్థానికుడే అయినా, ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటూ ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండరని టీడీపీ శ్రేణులు వైసీపీ విమర్శలను తిప్పి కొడుతున్నాయి. సమస్యల పరిష్కారానికి దీటుగా ప్రతిస్పందించే నాయకుడు రావడంతో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. ప్రత్యర్థుల కన్నా ముందే ఏలూరు రోడ్డులో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి, ఎన్నికలను ఎదుర్కొనే దిశగా కార్యకర్తలను సమరోన్ముఖుల్ని చేశారని అవినాష్‌ను సీనియర్ నాయకులు ప్రశంసిస్తున్నారు.
టీడీపీ ఆవిర్భావం తరువాత గుడివాడ నియోజకవర్గంలో ఏడు సార్లు విజయబావుట ఎగురువేసిన చరిత్రను పునరావృతం చేయాలనే కసి ప్రతి కార్యకర్తలోనూ కనిపిస్తోంది. టీడీపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కొడాలి నాని, పార్టీ ఫిరాయించడమే కాక తమ అధినేత చంద్రబాబును నోటికి వచ్చినట్లు మాట్లాడ టాన్ని కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే నానీని ఈసారి ఎలాగైనా ఓడించి, గుడివాడను చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలన్న కసిని కార్యకర్తలు కనబరుస్తున్నారు. ఎప్పుడూ గెలుపు తమదే అన్న ధీమాలో ఉండే కొడాలి నాని శిబిరంలో కళ తప్పింది. గ్రామాల్లో అవినాష్ ప్రచారంలో నెలకొంటున్న సందడితో పోలిస్తే వైసీపీ ప్రచారాలు వెలవెలబోతున్నాయి. ఆ పార్టీ నాయకుల్లో సైతం గెలుపుపై ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. టీడీపీలో బహునాయకత్వం కలసి పనిచేస్తుండటంతో వైసీపీలో ఆందోళన నెలకొంది. వైసీపీ మొత్తం ఒక్క నానీపైనే ఆధారపడి ఉండటంతో, పార్టీలో ఊపు తెచ్చే వారే లేకపోయారనే అభిప్రాయం పలువురిలో నెలకొంది.