రాష్ట్ర మంత్రి కొడాలి నాని, ఎన్నికల కమిషన్ తన పై ఇచ్చిన ఆదేశాల పై, హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటీషన్ పై, నిన్న విచారణ జరిగింది. వీడియో టేప్ లు పరిశీలించేందుకు, ఈ రోజు హైకోర్టు కేసుని వాయిదా వేసింది. ఈ రోజు దీని పై మళ్ళీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి, అటు ఎన్నికల కమిషన్ నుంచి, ఇటు కొడాలి నాని వైపు నుంచి న్యాయవాదులు వీడియోలు టేప్ లు అందించారు. ఈ వీడియో టేప్ లు పరిశీలించిన హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వీడియో టేప్ లు ఎవరికి అనుకూలంగా వారు అందించారన్న భావనలోకి హైకోర్టు వచ్చింది. అంతే కాకుండా, రాజ్యాంగ న్యాయసూత్రాలను విశదీకరించడంలో విఫలం అయ్యారని, హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి కేసుల్లో లోతైన విచారణ జరపాలని తాము భావిస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. సరైన వీడియో టేప్ లు అందించాలని ఇటు ఎన్నికల కమిషన్ నుంచి, ఇటు కొడాలి నాని వైపు న్యాయవాదులును కూడా రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అంతే కాకుండా, ఈ కేసులో, హైకోర్టుకు సహాయపాడేందుకు, సీనియర్ న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ రోజు సాయంత్రం లోగా, సీనియర్ న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమించే అవకాసం ఉంది.
బుధవారానికి ఈ కేసుని హైకోర్టు వాయిదా వేసింది. గతంలో కొడాలి నాని ఎన్నికల కమిషన్ ను కించపరిచే విధంగా, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేసారని, ఈ నెల 21వ తేదీ వరకు మీడియాతో మాట్లాడ కూడదు అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అదే విధంగా, గ్రూపు సమవేసల్లోనూ, బహిరంగ సమావేశాల్లో ఆయన మాట్లాడకూడదు అని ఆంక్షలు విధించింది. దీంతో పాటు, ఎన్నికల కమిషన్ ను కించ పరిచే విధంగా, మాట్లాడినందుకు, ఆయన పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు, ఆ సెక్షన్ ల కింద కూడా కేసులు నమోదు చేయాలని, ఎన్నికల కమిషన్, కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ ఆదేశాలు సవాల్ చేస్తూ, కొడాలి నాని శనివారం హైకోర్టు లో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయగా, ఆదివారం నిన్న సాయంత్రం విచారణకు వచ్చింది. ఈ రోజు వాయిదా పడిన కేసు పై, హైకోర్టు వీడియో టేప్ లు పరిశీలించి అసంతృప్తి చెంది, సరైన వీడియో టేప్ లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.