పోలవరం నిర్మాణాన్ని, అడుగఅడుగునా అడ్డుకునేది జగన్, కేవీపీ.. వీరికి కేంద్రం సహకారం ఎలాగూ ఉందనుకోండి.. జగన్, కేవీపీ మాత్రం, పోలవరం పూర్తికాకుండా, చెయ్యని ప్రయత్నం లేదు. ఎందుకు అలా అంటే, దానికి కొన్ని పాత లెక్కలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి టైంలో, పోలవరం కాంట్రాక్టు, తదితర అంశాల పై ఇద్దరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అందుకే, కడుపు మంట ఇలా చల్లార్చుకుంటున్నారు. ఇదే కడుపు మంట, స్పీకర్ కోడెల పై చూపించారు, కేవీపీ. ఇటీవల స్పీకర్ కోడెల పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయాంలో పోలవరం పనులు 2శాతమే పూర్తయ్యాయని కోడెల ఆరోపించారు.

దీన్ని ఉటంకిస్తూ ఏపీ స్పీకర్‌ కోడెలకు ఎంపీ కేవీపీ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ హయాంలో పోలవరం పనులు 2 శాతమే జరిగాయనడం సరికాదని పేర్కొన్నారు. పోలవరం పనులు చూసి పులకించిన కోడెల.. అసత్యాలు మాట్లాడారని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ లేఖ రాసినపై ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఇది కోడెల లేఖ.. " జులై 31 వ తారీఖున గుంటూరుజిల్లా రైతాంగంతో కలిసి నేను పోలవరం ప్రాజెక్టు సంర్శించటం జరిగింది. నాతోపాటు జలవనరుల శాఖా మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు వున్నారు. ఆనాడు పోలవరం ప్రాజెక్టు సందర్శించాక విలేకరులతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని గురించి ప్రస్తావించటం జరిగింది. దానికి స్పందిస్తూ గౌరవ రాజ్యసభ సభ్యులైన డా. కె.వి.పి.రామచంద్రరావు గారు నాకొక సుదీర్ఘమైన లేఖ వ్రాయటం జరిగింది."

"1941 నుంచి 2014 వరకు ప్రాజెక్టులో కేవలం 2 శాతం పని జరిగిందని, ఆ తరువాత ప్రస్తుత ముఖ్యమంత్రిగారి కార్యదక్షత, చొరవ వలన ప్రాజెక్టును ప్రస్తుత జలవనరుల శాఖామంత్రి గారికి అప్పగించగానే ప్రాజెక్టు 56 శాతం పూర్తయిందని నేను తెలిపినట్లు వారు ప్రస్తావిస్తూ, 1941 నుంచి 2014 వరకు ప్రాజెక్టులో కేవలం 2 శాతం పని మాత్రమే పూర్తిఅయిందని చెప్పటం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. ఉద్దేశ్యపూర్వకంగా రాజ్యాంగపదవిలో వున్న నాచేత జాతిని తప్పుదోవ పట్టించటమేనని వారు వారి లేఖలో ప్రస్తావించటం జరిగింది. బాధ్యతాయుతమైన పదవిలో వున్న నన్ను స్వార్థరాజకీయాలకు పావుగా వాడుకోవాలనుకోవటం చాలా బాధ కలిగిస్తుందని గౌరవనీయమైన, ఉన్నతమైన స్థానంలో వున్న మీకే ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో అంటూ లేఖ వ్రాశారు. ఈ లేఖతోపాటు 2014 వరకు పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందో సమాచారాన్ని అనుబంధం రూపంలో ఇస్తున్నానంటూ వారు తమ లేఖకు జతచేసి పంపిస్తూ పోలవరం ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ అనుమతినిచ్చిన దగ్గరనుంచి 2014 వరకు ఎంత పని జరిగింది, ఆ తరువాత ఎంత పని జరిగింది వంటి వివరాలతోసహా శ్వేతపత్రం విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించమంటూ వారు కోరారు."

"ఈ సందర్భంగా తెలియజేసేదేమంటే - నేను సందర్శించేనాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు 56 శాతం పూర్తికావటం అనేది అక్షరసత్యం. ఇది వాస్తవమని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సందేహం వున్నవారు ఎవరైనా సరే ప్రభుత్వ గణాంకాలు తెప్పించుకుని నిజాలు నిర్ధారించుకోవచ్చు. ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రాజెక్టు పనులను సమీక్షించే సందర్భంగా ఇచ్చే చాలా నివేదికలో ఏ వారానికి ఆ వారం ఆయా విభాగాలవారీగా ఎంత పురోగతి జరిగింది, ప్రాజెక్టు మొత్తమ్మీద ఎంత పురోగతి జరిగింది అనే వివరాలు పొందుపరచి వుంటున్నాయి. ఇకపోతే నేను 1941 నుంచి 2014 వరకు కేవలం 2 శాతం పని మాత్రమే జరిగిందని చెప్పటం, ప్రభుత్వం నాచేత అలా చెప్పించటం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు అనుబంధంగా జతచేసిన సమాచారాన్ని చూస్తే 2005 నుండి 2012 వరకు అనేక అనుమతులు తెచ్చినట్లు తెలిపారు. అలాగే 2012 జులైలో ఎర్త్ డ్యామ్, స్పిల్ వే వర్క్ టెండర్లు ఫైనలైజ్ చేయటం జరిగిందని వారే తెలియజేశారు. అంటే ఈ విభాగాల్లో అంతకుముందు ఏమీ పని జరగలేదని వారూ ఒప్పుకున్నట్లేగా!"

"అన్ని అనుమతులు ఉన్నట్లు మీరే తెలిపారు. మరి అనుమతులుంటే హెడ్ వర్క్ పనులు ఎందుకు చేపట్టలేదు? మీరు పనులు అప్పగించిన ఏజెన్సీలు పనులు చేయలేమని ఎందుకు కాడి క్రిందపడేశాయి? కాలువలు త్రవ్వాం అని చెప్పారు. పోనీ కాలువలు పూర్తిచేశారా? లేదు. ఎక్కడ అవకాశం వుంటే అక్కడ మట్టి త్రవ్వకం పనులు చేశారు. కాలువల మీద నిర్మించాల్సిన భారీ కాంక్రీటు నిర్మాణాలు వదిలేశారు. కనీసం మధ్యతరహా నిర్మాణాలు కూడా చేపట్టలేదు.
ఈ పరిస్థితుల్లో ఇప్పటి ప్రభుత్వం ఆర్థిక ఒడిదుడుకులు, అనేక కృత్రిమ అడ్డంకులు తొలగించుకొని పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను రూపొందించి త్వరితగతిన పూర్తిచేసి కుడి, ఎడమ కాలువలకు గోదావరి నీటిని విడుదల చేసి, రైతాంగాన్ని ఆదుకోవటం వాస్తవం కాదా."

కాబట్టి గత ప్రభుత్వం దశాబ్దకాలం (2004-2014) పాటు కేవలం అనుమతులు వచ్చాయని పులకించిపోవటమే తప్ప ఆ అనుమతులకు తగ్గట్లు పనులు చేసి, వృధాగా సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను ఇటు కృష్ణానదికి అటు ఉత్తరాంధ్రకు మళ్ళించినట్లయితే గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల ఆయకట్టు స్థిరీకరించబడేది, అలాగే కృష్ణానదిలో ఆదాచేసిన నీరు రాయలసీమకు అందించబడేవి అంటూ ప్రతిఒక్కరూ అనుకోవటం వాస్తవం కాదా. అనుమతులన్నీ వుండి, నిధులు వెచ్చించే అవకాశం వుండి కూడా పాలకులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించటం వలన పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ. 57 వేల కోట్లకు పెరగటానికి కారకులు అప్పటి పాలకులు కాదా? ఈ విషయాలన్నీ ఒకసారి పెద్దలు ఆలోచించాలి.

ఆ తరువాత వారేదో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసినట్లు, దానికి ప్రభుత్వం ఇంతవరకు సమాధానం చెప్పలేదని, దానిపై ప్రభుత్వాన్ని ఆదేశించమంటూ కూడా కోరారు. ఈ వ్యాజ్యంపై మొదటి ప్రతివాది అయిన కేంద్రప్రభుత్వం తరఫున జలవనరులశాఖా విభాగము సెక్రటరీ గారు కౌంటరు అఫిడవిట్ దాఖలు చేసినందున కోర్టులో పెండింగ్ లో వున్నది అని తెలియవచ్చింది. ఈ విషయం న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్నందున ఈ విషయంపై అతిగా మాట్లాడటం సమంజసం కాదు. న్యాయవ్యవస్థ తన పని తాను చేసుకొంటూ పోతున్నదని గమనించవలసి వుంది. అదేవిధంగా అంతకుమునుపూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ మెమో ఆఫ్ అప్పియరెన్స్ లేఖను దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఇవి కోర్టు పరిశీలనలో ఉన్నందువలన మీరు ప్రభుత్వాన్ని ఆదేశాలు ఇవ్వమని కోరటం ఎంతవరకు సబబో పునరాలోచన చేయవలసి వుంది.

పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వం చాలా పారదర్శకంగా వుంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తావుంది. దీని పైన ప్రత్యేకించి ఒక వెబ్ సైట్ ను కూడా రూపొందించింది. అలాగే ప్రత్యేకంగా జి.వో. జారీచేసి, పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రజానీకానికందరకు ప్రాజెక్టును స్వయంగా సందర్శించేలా భోజనాది సదుపాయాలతో సహా ఉచితంగా బస్సులను ఏర్పాటుచేసి మరీ అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే దాదాపు 90 వేల మందికి పైగా ప్రజలు ఈ ప్రాజెక్టును స్వయంగా సందర్శించి "అహో పోలవరం... అద్భుత నిర్మాణం' అంటూ కొనియాడుతున్న విషయాన్ని గమనించైనా వాస్తవ పరిస్థితులను విజ్ఞులైన పెద్దలు గ్రహించుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read