ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జగన్ పై కోడి కత్తి దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడి కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. ఎన్‌ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేయాలని గతంలో పిటిషన్ దాఖలైంది. దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారు అవుతాయని పిటిషనర్ వాదించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు నిర్ణయం చెప్పాలని గతంలోనే ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. తాజాగా ఏపీ హైకోర్టు తీర్పునిస్తూ జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది.
మరో పక్క ఈ కేసు పై విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా నిన్న మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేలంకకు చెందిన జనిపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి విశాఖ విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్ 25న దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ వివరాలను బుధవారం వెల్లడించారు. విపక్ష నేతపై దాడికి సంబంధించిన కేసులో వాస్తవాలు ప్రకటించాలని భావించి, న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ అనుమతితో వివరాలు వెల్లడిస్తున్నట్టు సీపీ పేర్కొన్నారు. దీనిలో రాజకీయ కోణం ఏమీ లేదని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో పార్టీ నాయకుడు ధర్మశ్రీతో మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారమే కోడికత్తితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ దాడిలో జగన్‌కు భుజంపై గాయమైందన్నారు. కేవలం ప్రచారం కోసమే ఇదంతా చేసినట్టు తెలిపారు.
విపక్ష నేతపై దాడికి సంబంధించి గతేడాది అక్టోబర్ 18 పథకం రూపొందించాడని, అయితే దసరా సందర్భంగా జగన్ 17నే హైదరాబాద్ వెళ్లిపోవడంతో సాధ్యపడలేదన్నారు. జగన్‌పై దాడికి యత్నించిన శ్రీనివాస్, హత్యాయత్నానికి ఉపయోగించిన ఆయుధం కోడికత్తికి రెండు సార్లు పదును పెట్టించాడని తెలిపారు. త్వరలోనే తాను టీవీల్లో కనిపిస్తానంటూ సహచరుల వద్ద పేర్కొన్నాడన్నారు. ఇదే విషయాన్ని హేమలత, షేక్ అమ్మాజీలకు చెప్పినట్టు తెలిపారు. దాడి చేసినప్పుడు శ్రీనివాస్ వద్ద లభించిన లేఖను విజయదుర్గతో పాటు మరో ఇద్దరితో రాయించి, జెరాక్స్ తీయించి తన వద్ద ఉంచుకున్నాడన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ కావాలనుకునే ఈ ఘటనకు పాల్పడినట్టు సీపీ తెలిపారు. దీనిలో భాగంగానే జగన్‌తో సెల్ఫీ తీయించుకుంటానని నమ్మబలికి వైసీపీకి చెందిన ఒక నాయకుని ప్రయేయంతో జగన్ బస చేసిన వీఐపీ లాంజ్‌కు చేరుకున్నట్టు విచారణలో వెల్లడైందన్నారు.