రెండు తెలుగు రాష్ట్రాల సియంలకు అత్యంత ప్రీతిపాత్రుడు, విశాఖ శారదా పీఠానికి చెందిన పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. మొన్న విజయవాడ కృష్ణాతీరంలో జరిగిన, శారదాపీఠ ఉత్తరాధికారి నియామక కార్యక్రమంలో , జగన్, కేసీఆర్ పాల్గున్నప్పుడు, ఒకరు నా ఆత్మ, ఒకరు నా ప్రాణం అంటూ స్వరుపానంద చెప్పుకొచ్చారు. అంతే కాదు, జగన్ సియం అవ్వటం కోసమే శారదా పీఠం పని చేసిందని, మరో 15 ఏళ్ళు ఆయనే సియంగా ఉండటానికి పని చేస్తామని స్వరుపానంద చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓక సన్యాసి ఇలా మాట్లాడటం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇదే విధంగా కేసీఆర్ పై కూడా ప్రశంసలు గుప్పించారు స్వామి.జగన్ కేమో ముద్దులు, కేసీఆర్ కేమో ఆలింగనాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు స్వరూపానంద. వీళ్ళ ముగ్గిరి కలయిక, వీరు చెప్పిన ప్రవచనాలు, వీళ్ళ హావభావాలతో కృష్ణా తీరం పులకించి పోయిందా అనేంతగా హడావిడి చేసారు. స్వామి వారి భక్తికి మెచ్చిన కేసీఆర్, వెంటనే హైదరబాద్ వెళ్లి , క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు.
అదే గండిపేట మండలంలోని కోకాపేట వద్ద విశాఖపట్నం శారదాపీఠంకు రెండెకరాల స్థలం కేటాయించటం. దీని కోసం ఒక జీ.ఓ కూడా విడుదల చేసింది. ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం శారదా పీఠానికి రెండెకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేసారు. ఇంతకీ ఎకరం భూమి ఎంతో తెలుసా ? తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఎకరానికి రూపాయి చొప్పున ఈ కేటాయింపు జరిగింది. అంటే రెండు ఎకరాలకు, రెండు రూపాయలు అనమాట. ఈ స్థలంలో శారదా పీఠం గురుకుల వేద పాఠశాలను నెలకోల్పనుంది. అయితే కోకాపేటలో రియల్ ఎస్టేట్ భూమ్ అధికంగా ఉంది. అక్కడ ఎకరా 25 కోట్లు దాకా పలుకుతుంది. అలాంటి చోట, కేసీఆర్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం, రాష్ట్ర సంపదను, ఇలా అప్పనంగా, ఎకరా రూపాయికి ఇచ్చేసారు. పోనీ ఇక్కడ పరిశ్రమలు వచ్చి, ఉద్యోగాలు వస్తాయా అంటే అదీ లేదు. కేసీఆర్ ఇంత ఉదారత చూపి, ఎకరా రూపాయికి ఇచ్చేస్తే, మరి మన జగన్ గారు, ఎంత ఉదారత చూపుతారో చూద్దాం.