కోలా గురువులు దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్. ఇచ్చిన డబ్బు వసూలు చేసుకోలేని సత్తెకాలపు రాజకీయనేత. 2014 ఎన్నికల్లో వైసీపీ పెద్దలు తనని డబ్బు కోసం ఎలా పీల్చుకుతిన్నారో ఓ ఆడియో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఎన్నికలకి ఎంత ఖర్చు పెడతావు అని జగన్ రెడ్డి బంధువులు అడిగేవారని 10 కోట్లు పెడతానంటే 20 కోట్లు అడిగేవారని, 20 కోట్లు రెడీ చేస్తే నలభై చూడమంటూ పీల్చుకుతిన్నారని ఆవేదన వ్యక్తం చేసిన రాజకీయ నేతే ఈ కోలా గురువులు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి చెందిన కోలా గురువులు మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు. ఆ ప్రాంతంలో మంచి పేరుంది. దీంతో రాజకీయరంగ ప్రవేశంచేసి 2009లో తొలిసారిగా ప్రజారాజ్యం పార్టీ తరఫున విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 341 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో గురువులు జగన్ రెడ్డి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికలకి ద్రోణంరాజు శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చేశారు. ఆయనా ఓడిపోయారు. టిడిపి నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరిపోయారు. ఏళ్లుగా కోలా గురువులుతో వైసీపీ కోసం కోట్లు ఖర్చుపెట్టించారు. ఒకసారి వైసీపీ టికెట్ పై ఓడిపోయారు. మరోసారి టికెట్ ఇవ్వలేదు. వచ్చేసారీ గురువులుకి టికెట్ అనుమానమే. దీంతోనే పాత బకాయిలు చెల్లు చేసేందుకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిచ్చారు. దానికి నిధులూ లేవు, విధులు లేకపోవడంతో కోలా గురువులు గుర్రుగా ఉన్నారు. విశాఖలో నాలుగు నియోజకవర్గాలు టిడిపి చేతిలో ఉన్నాయి. మత్స్యకారుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. మత్స్యకారుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న గురువులు లాంటి వారు దూరమైతే మళ్లీ విశాఖలో ఓటమి తప్పదని గురువులుకి ఎమ్మెల్సీగా ఇస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, టిడిపి నుంచి కొనుగోలు చేసిన నలుగురు, జనసేన నుంచి తీసుకొచ్చిన 1తో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు కొట్టేయొచ్చనుకున్నారు. అయితే అనూహ్యంగా వైసీపీ నుంచి నలుగురు క్రాస్ ఓటింగ్ చేయడంతో కోలా గురువులు ఓడిపోయి, టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్సీగా గెలిచింది. దీంతో గురువులుకి మరోసారి అన్యాయం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచి అధ్యక్షా అనే అవకాశం కోసం చూస్తే అదీ దక్కలేదు. చివరికి ఎమ్మెల్సీగానైనా సభలో అడుగుపెట్టి అధ్యక్షా అందామంటే అదీ పాయే! వైసీపీ కోసం పెట్టిన కోట్లు వచ్చే దారి కనపడక గురువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
వైకాపా దెబ్బకి కోలా గురువులు దివాళా
Advertisements