బెంగాల్‌లో సీబీఐ వర్సెస్ బెంగాల్ పోలీస్ యుద్ధం కొనసాగుతోంది. శారదా స్కామ్ విచారణలో భాగంగా కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్‌ని విచారించేందుకు సీబీఐ ప్రయత్నించగా బెంగాల్ పోలీసులు అడ్డుకోవడం...సీబీఐ అధికారులను బంధించడం..మమతా బెనర్జీ దీక్ష చేయడం వంటి పరిణామాలతో..దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పశ్చిమ బెంగాల్ సీఎం, కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం కోల్‌కతాలో మళ్లీ రగడ నెలకొంది. సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావును బెంగాల్ పోలీసులు టార్గెట్ చేశారు. నాగేశ్వరరావు భార్యకు చెందిన పలు కంపెనీల్లో సోదాలు జరిపడంతో తీవ్ర కలకలం రేగింది.
కోల్‌కతాలో రెండు చోట్ల పోలీసులు దాడులు చేశారు. సాల్ట్‌లేక్ ప్రాంతంలోని ఎంజెలినా మర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మరో కంపెనీలో సోదాలు జరిపారు. నాగేశ్వరరావు భార్య, కూతురు, ఈ కంపెనీల మధ్య పలు ఆర్థిక లావాదేవీలు జరిగాయని పోలీసులు చెప్పారు. కేవలం లావాదేవీల పరిశీలన కోసమే సోదాలు చేసినట్లు వెల్లడించారు. కోల్ కతా పోలీస్ బృందం బౌబజార్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేస్ విషయంలో ఏంజెలా మర్కంటైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎంపిఎల్)పై దాడులు చేశారు. ఫిబ్రవరి 1994లో ప్రారంభమైన ఏఎంపిఎల్ ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్ బిఎఫ్ సి). దీని రిజిస్టర్డ్ కార్యాలయం 5 క్లైవ్ రో (డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సారణి)లో ఉంది. అక్టోబర్ 2018 వరకు ఈ రిజిస్టర్డ్ కార్యాలయం సాల్ట్ లేక్ సిటీ, సెక్టర్-1లోని సీఏ బ్లాక్ లో ఉండేది. ఏఎంపిఎల్ ద్వారా నాగేశ్వరరావు భార్య సంధ్య పలు ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు.
2011 మార్చిలో సంధ్య రూ.25 లక్షలు ఏఎంపీఎల్ నుంచి అప్పు తీసుకున్నారు. 2011-2014 మధ్య కాలంలో ఆమె మూడు విడతల్లో రూ.1.14 కోట్లు ఏఎంపీఎల్ కు అప్పు ఇచ్చారు. 2012లో రూ.35.56 లక్షలు, 2013లో రూ.38.27 లక్షలు, 2014లో రూ.40.29 లక్షలను సంధ్య రుణం ఇచ్చారు. దాడుల్లో స్వాధీనం చేసుకొన్న పత్రాలలో నాగేశ్వరరావు కుమార్తె కంపెనీ నుంచి జీతంగా డబ్బు పొందినట్టు కోల్ కతా పోలీసులు గుర్తించారు. 2013-14 నుంచి 2015-16 వరకు ‘ఇచ్చిన చిరునామాలోని’ (సాల్ట్ లేక్ సెక్టార్-1 అడ్రస్ లో నివాసం ఉంది) కంపెనీ ఆమెకు రూ.14 లక్షలు జీతంగా ఇచ్చినట్టు అధికారులు చెప్పారు. 2014లో కేవలం ఒకేఒక్క రోజులో రూ.4.5 లక్షలను ఏడాదంతటికీ జీతంగా ఇచ్చినట్టు కోల్ కతా పోలీస్ వర్గాలు తెలిపాయి.