జగన్ గారి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజల పట్ల ఆందోళన చేస్తాం అంటేనే, భయపడి పోతుంది. నెల రోజుల క్రితం ఇసుక విషయంలో తెలుగుదేశం పార్టీ ధర్నాకు పిలుపిస్తే, ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేసారు. చంద్రబాబు చలో ఆత్మకూరు పిలుపిస్తే, ఆయన్ను బయటకు కూడా రానివ్వలేదు. తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద, ఆందోళనలు చెయ్యటానికి వీలు లేకుండా 144 పెట్టరు. ఇలాగే అన్ని విధాలుగా,నిరసన తెలిపే హక్కు లేకుండా చేస్తున్నారు. తాజాగా, మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఇసుక కృత్రిమ కొరతకు నిరసనగా మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద ఆయన తలపెట్టిన 36 గంటల దీక్ష చెయ్యటానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇలా చెయ్యటం కుదరదని, ఆయనని అరెస్ట్ చేసి, దీక్షను భగ్నం చేశారు పోలీసులు. అయితే ప్రభుత్వం తీరు పట్ల, తెలుగుదేశం పార్టీ మండి పడుతుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇలాగే అలోచించి ఉంటే , జగన్ పాదయాత్ర చేసే వారా అని ప్రశ్నిస్తుంది.
కొల్లు రవీంద్ర దీక్ష గురించి తెలుసుకున్న పోలీసులు, ముందుగా, కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, పోలీసుల వ్యూహం తెలుసుకుని, అప్పటికే వేరే మార్గంలో కోనేరు సెంటర్‌కు రవీంద్ర చేరుకున్నారు. అక్కడే దీక్షలో కూర్చున్నారు. అయితే వెంటనే పోలీసులు వచ్చి, అక్కడ బలవంతంగా ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో పోలీసులకు, తెలుగుదేశం పార్టీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. అంతకుముందు ఆయన నిరసన దీక్షకు వెళ్లకుండా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. దీక్షలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో 144 సెక్షన్ విధించారు.
అయితే, తన దీక్ష ను భగ్నం చేసినా, తన నివాసంలోనే 36 గంటల దీక్ష కొనసాగిస్తానని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. "ఇసుక కొరతపై గాంధీ అహింసా మార్గంలో దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాము. పోలీసులు మమల్ని రాత్రి నుంచి వేధిస్తూ మా దీక్షను అడ్డుకుంటున్నారు. రెండు పోలీస్ స్టేషన్లు తిప్పి ఇంటికి తీసుకొచ్చారు. జగన్ నియంతలా మారి ప్రజావ్యతిరేక విదానాలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఇసుక లేక అసంఘటిత కార్మికులు పస్తులుంటున్నారు. కొత్త ఇసుక పాలసీ వచ్చి నెల రోజులు గడుస్తున్నా..సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. వైసిపి నాయకులకే ఇసుక కేంద్రాల నుంచి ఇసుక తరలిపోతోంది. ప్రభుత్వానికి ఈ విషయం మా నిరసన ద్వారా చెప్పాలని చూస్తే పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ, పోలీసుల బెదిరింపులకు బయపడేది లేదు. 36 గంటల దీక్షతో ఆపేది లేదు దఫదఫాలుగా సామాన్యులకు ఇసుక చేరే వరకు మా నిరసన కొనసాగిస్తాం" అని కోల్లు రవీంద్ర అన్నారు.