మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ బహిరంగంగా తెదేపాకు మద్దతు ప్రకటించారు. ప్రత్యేకహోదా, విభజన హామీలు సాధించే సత్తా తెదేపాకే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో తెదేపా తరఫున ప్రచారం చేస్తానని.. ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే రాష్ట్రమంతటా పర్యటిస్తానని కొణతాల స్పష్టం చేశారు. తెదేపాకు మద్దతుగా కొణతాల ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన త్వరలో ఆ పార్టీ కప్పుకునే అవకాశముంది. కొణతాల ఏ పార్టీలో చేరతారనే విషయంపై గత కొన్ని నెలలుగా పలు ఊహాగానాలు వినిపించాయి.
తెదేపా, వైకాపాల్లో ఆయన దేనిలో చేరనున్నారనే దానిపై అనేక చర్చలు విస్త్రృతంగా ప్రచారం జరిగింది. ఓ దశలో తెదేపాలో ఆయన చేరిక ఖాయమైందని.. అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ క్రమంలో ఆయన వైకాపా అధ్యక్షుడు జగన్‌తోనూ భేటీ అయ్యారు. దీంతో ఒకింత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెదేపాకు మద్దతుగా కొణతాలే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయడంతో ఆయన తెదేపాలో చేరడం ఇక లాంఛనమే కానుంది.
‘‘టీడీపీకి మద్దతు తెలపాలని నేను, నా అనుచరులు నిర్ణయించుకున్నాం. ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేస్తా. ఉత్తరాంధ్రకు మేలు చేసే పార్టీకి మద్దతు తెలపాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది. కేంద్రం పోలవరం ప్రాజెక్టును కాలయాపన చేస్తోంది.ఆర్థిక లోటు విషయంలో కూడా అన్యాయం చేసింది. రైల్వేజోన్ వచ్చినా డివిజన్ పోయింది. చాలా హామీల అమలులో కేంద్రం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ ఏపీ హామీలపై తీర్మానం కూడా చేసింది’’ అని కొణతాల ప్రకటించారు.