రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ధర్మ పోరాట దీక్ష’ చేస్తున్న సంగతి తెలిసిందే. తన పుట్టిన రోజైన ఈనెల 20వ తేదీన బాబు దీక్ష చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 12 గంటలపాటు నిరశన దీక్ష చేస్తారు. ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొనేందుకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లాలని భావిస్తున్నాయి. అయితే తెలుగు దేశం పార్టీ కూడా ఈ దీక్షను విజయవంతం చేయడానికి అందరి మద్దతును కోరుతోంది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలందరికీ దీక్షకు హాజరు కావాలని ఆహ్వానాలు పంపింది.
విశాఖ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు కూడా ఆహ్వానం అందింది. మంగళవారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి కళా వెంకటరావు, సాయంత్రం నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమలు వేర్వేరుగా ఫోన్ చేసి, కొణతాలను తప్పకుండా దీక్షకు హాజరు కావాలని కోరినట్టు తెలిసింది. ఇప్పటికీ కొణతాల రామకృష్ణ, ఏ పార్టీలో లేరు. ప్రస్తుతం, విశాఖ రైల్వే జోన్ కోసం పోరాడుతున్నారు.. చాలా రోజులుగా, జగన్ తన పార్టీలోకి లాగటానికి ప్రయత్నిస్తున్నా, ఆయాన మాత్రం, జగన్ పార్టీలో చేరటానికి మక్కువ చూపటం లేదు. ఈ నేపధ్యంలో, ఆయన చంద్రబాబుతో పాటు, విజయవాడ వచ్చి దీక్షలో కూర్చుంటారనే సమాచారం వస్తుంది.
ధర్మ పోరాట దీక్షకు అన్ని పార్టీల నేతలను, అఖిలపక్ష నేతలను ఆహ్వానిస్తున్నామని నారా లోకేశ్ తెలిపారు. వారితో పాటు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా, వాణిజ్య, ఉపాధ్యాయ సంఘాలు, బార్ అసోసియేషన్, ట్రేడ్ యూనియన్లు, రిక్షా, ఆటో యూనియన్లు, విద్యార్థి సంఘాలతో పాటు వైద్యులు, ఇతర వృత్తుల వారంతా దీక్షలో పాల్గొనాలని కోరారు. ‘‘ఏపీకి జరుగుతున్న అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఢిల్లీలో కదలిక రావాలని ఈ పవిత్ర దీక్షకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి’’ అని తెలిపారు. విభజన కష్టాలున్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని... సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని చెప్పారు.