కర్నూలు జిల్లాలో టికెట్ల చిక్కుముళ్లను టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఒక్కటొక్కటిగా విప్పుతున్నారు. కేఈ, కోట్ల కుటుంబాలకు ఇవ్వదలచిన టికెట్లపై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. కర్నూలు, నంద్యాల లోక్‌సభ స్థానాల పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులతో శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆయన అమరావతిలో సమీక్ష జరిపారు. నేతలతో విడివిడిగానూ చర్చించారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరులతో మాట్లాడి.. డోన్ నుంచి కేఈ సోదరుడు ప్రతాప్, పత్తికొండ నుంచి కేఈ తనయుడు శ్యాంబాబుకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఈ నెల 28న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీలో చేరనున్నారు.
ఆయనకు కర్నూలు లోక్‌సభ టికెట్, ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నారని పార్టీ నాయకులు తెలిపారు. ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, బనగానపల్లె నుంచి ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి, మంత్రాలయంలో ఇన్‌చార్జి తిక్కారెడ్డి, ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు పోటీపై సీఎం స్పష్టత ఇచ్చారని అంటున్నారు. కర్నూలు కోసం ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎంపీ టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్ పోటీ పడుతున్నారు. అక్కడ ఉత్కంఠ కొనసాగుతోంది. నంద్యాలలోనూ ఇదే పరిస్థితి. ఆళ్లగడ్డ, నంద్యాల తమకే ఖరారు చేశారని భూమా వర్గీయులు చెబుతున్నా..ఎంపీ ఎస్పీవై రెడ్డి తమ కుటుంబంలో ఒకరికి ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిసింది.
ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి కూడా తనకే కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అలాగే, శ్రీశైలం అసెంబ్లి స్థానానికి బుడ్డా రాజశేఖరరెడ్డిని, పత్తికొండకు కేఈ శ్యాంబాబును, డోన్‌కు కేఈ ప్రతాప్‌ను ప్రకటించినట్టు తెలిసింది. ఆలూరు స్థానానికి కోట్ల సుజాతమ్మను, ఆళ్లగడ్డకు అఖిలప్రియను, ఆదోనికి మీనాక్షినాయుడును, కర్నూలుకు ఎస్వీ మోహనరెడ్డిని, ఎమ్మిగనూరుకు జయనాగేశ్వర్‌రెడ్డిని, బనగానపల్లెకు బీసీ జనార్దనరెడ్డిని ప్రకటించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, నంద్యాల, పాణ్యంలపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. నంద్యాల ఉప ఎన్నికలలో గెలిచిన తీరును ఉదాహరిస్తూ అదేతీరును సార్వత్రిక ఎన్నికలలో కనబరచాలని జిల్లా నేతలకు ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది.