పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో రక్షిత మంచినీటి పథకం నుండి పంపిణీ చేసే నీటిలో విషప్రయోగం జరిగింది. డెలివరీ వాల్వు వద్ద వాటర్ షవర్‌లో పురుగుల మందు కలిపినట్టు సిబ్బంది గుర్తించి, మంచినీటి సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. కుమారదేవం గ్రామప్రజలకు ప్రతి రోజు ఉదయం రక్షిత మంచినీటి ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా చేస్తారు. ఆదివారం ఉదయం మంచినీటి సరఫరా నిమిత్తం వచ్చిన పంచాయతీ ఉద్యోగి దాసరి పోలయ్య ట్యాంకు డెలివరీ వాల్వు షవరు వద్ద పురుగుల మందు వాసన వస్తున్నట్టు గుర్తించారు. దీనితో మంచినీరు సరఫరా చేయకుండా, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు.
ఆయన హుటాహుటిన ట్యాంకు వద్దకు వచ్చి నీటిని పరిశీలించారు. అనంతరం ట్యాంకులో ఉన్న నీటిని పూర్తిగా ఔట్‌లెట్ ద్వారా బయటకు విడుదల చేసి, ట్యాంకును, షవరును శుభ్రం చేసిన అనంతరం తాగునీరు సరఫరా చేశారు. ఈ విషయమై కొవ్వూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ కేవీవీ సత్యనారాయణ, ఎస్సై రవీంద్రనాథ్ సందర్శించి వివరాలు సేకరించారు. పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కోణంలో ఇది జరిగిందా అనే విషయం పై పోలీసులు విచారణ చేస్తున్నారు.