నగర దర్శిని కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గురువారం కొవ్వూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు కొవ్వూరును గోవూరుగా మార్పు చేయాలని కోరారు. దీనిపై సీఎం కొవ్వూరును గోవూరుగా మార్చేందుకు పరిశీలిస్తామని సభలోనే నిర్ణయాన్ని ప్రకటించారు. గతంలో రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మార్పు చేసినట్లే నేటి కొవ్వూరును గోవూరుగా మార్పు చేస్తామని ప్రకటించడంతో సభలో ఉన్న స్థానికులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సభలో ఎమ్మెల్యే జవహర్ మాట్లాడుతూ చరిత్ర గలిగిన గోవూరులో ఒకప్పుడు గౌతమ మహాముని తపస్సు చేస్తున్న సమయంలో గోహత్య పాపం చుట్టుకోవడంతో శాప విమోచనానికి గోదావరిని గోవూరు తీసుకురావడంతో నేడు నేడు ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమైందన్నారు.
గోవూరు కాలక్రమేణా కొవ్వూరుగా మారిందని తిరిగి గోవూరుగా నామకరణం చేయాలని ప్రజలు కోరుతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్ళగా ముఖ్యమంత్రి సభా సమక్షంలోనే దీనిపై స్పందించారు. బ్రిటీష్ వారు ఈ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో గోవూరును కౌ(ఆవు)ఊరుగా పిలిచేశారు. గౌతమ మహర్షి తపోభూమి కాలక్రమంలో కొవ్వూరుగా స్థిరపడింది. గోవూరు సమీపంలో గౌతమి మహర్షి భూమిని అరకతో దున్నినచోటు ఉంది. ఈ ప్రాంతం నేడు ఆరికరేవులుగా మారింది. గౌతముడు మాయాగోవుపై దర్భ విధించడంతో గోవుకు దెబ్బతగిలి వేదన చెందిన ప్రాంతాన్ని పశువు వేదన అని ఉండేది. ప్రస్తుతం పసివేదలగా మారింది. వేదన చెందుతూ రాతి దెబ్బతగిలి గోవులు మరణించి చోటును చావుగొల్లుగా పిలిచేవారు. అది కాస్త నేడు చాగల్లుగా మారింది. అహల్య నివాశముండే ప్రాంతాన్ని చౌగమిగా పిలిచేవారు.అది కాలక్రమంలో తోగమ్మిగా మారింది.
పశివేదల జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సర్పంచి బేతిన కాశీఅన్నపూర్ణ అధ్యక్షత వహించగా జవహర్ ప్రారంభోపన్యాసం చేశారు. కొవ్వూరు నియోజకవర్గాన్ని రూ. 1,226 కోట్లతో అభివృద్ధిపర్చామన్నారు. నియోజకవర్గంలో 90 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పథకాలతో సంతృప్తి చెందుతున్నారన్నారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, సాంఘిక సంక్షేమ పాఠశాలను ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.