ఏ సందర్భమైనా ముఖ్యమంత్రి బాస్... ఐఏఎస్ లు ముఖ్యమంత్రులు చెప్పినట్టు వినాల్సిందే... కాని, నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో, కృష్ణా జిల్లా కలెక్టర్ చెప్పినట్టు చంద్రబాబు చేసారు... పాలనా వ్యవహారాలు కాదులేండి...అసలు విషయం ఏంటి అంటే, ఆదివారం ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన సూర్యారాధన కార్యక్రమంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం పురోహితుడి అవతారమెత్తారు...శ్లోకాలు, పూజలపై మంచి అవగాహన ఉంది. దసరా ఉత్సవాల సమయంలో కూడా ఆయన ప్రతిరోజూ అమ్మవారి వైభవం గురించి రోజుకొక శ్లోకం చెప్పి ఆకట్టుకున్న విషయం విదితమే...
ఆదివారం సూర్యారాధన వేదికపై దుర్గగుడి అర్చకుడు శివప్రసాదశర్మ సూర్యుడికి సంబంధించిన అర్ఘ్యమంత్రాలను చదివి చంద్రబాబును అర్ఘ్యం వదలాలని సూచించారు. అర్ఘ్యం ఏవిధంగా వదలాలన్న దానిపై సీఎం మీమాంసలో ఉండగా కలెక్టర్ ముందుకు వచ్చి రెండు అరచేతులు జోడించి దోసిలితో జలాన్ని తీసుకుని సూర్యుడి వైపు ఇలా వదలాలని చేసి సీఎంకు చూపించారు. దీంతో సీఎం ఆమేరకు మూడుసార్లు అర్ఘ్యం వదిలారు...
ప్రకృతి ఆరాధనతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరుగుతోందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆదివారం ‘సూర్య నమస్కారం’ కార్యక్రమాన్ని చేపట్టింది. మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటలకు విజయవాడ మునిసిపల్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి పాల్గొని ‘సూర్య వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యుడు జస్టిస్ చక్రవర్తిలాంటి వాడని సీఎం అభివర్ణించారు... బీద, ధనిక తారతమ్యాలు లేకుండా సూర్యుడు అందరికీ వెలుగులు ఇస్తాడని అన్నారు. అలుపెరుగకుండా ప్రపంచమంతా క్రమశిక్షణతో వెలుగులు పంచే బాధ్యతను నిర్వర్తించే సూర్యునికి రోజూ నమస్కారం చేస్తే చాలా మంచిదని, డి-విటమిన్ వస్తుందని అన్నారు...