అభ్యర్థుల ఖరారులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. రోజుకు రెండు పార్లమెంటు నియోజక వర్గాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళవారం విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష జరిగింది. ఇది బుధవారం తెల్లవారుజాము రెండు గంటల వరకు కొనసాగింది. తొలుత ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో చంద్రబాబు సమావేశం అవుతున్నారు. జిల్లాలో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. తాను ఇప్పటికే చేయించిన నాలుగు సర్వే నివేదికలను దగ్గర పెట్టుకుని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖాముఖి సమీక్షలు చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యే లేదా ఇన్‌చార్జితో వన్ టు వన్ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా సర్వే సారాంశాలను వారికి వివరించి, నివేదికలను చేతిలో పెడుతున్నారు. నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలను సైతం అధినేత ప్రస్తావి స్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో వివాదాస్పదమైన మట్టి తవ్వకాల అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిసింది.
కృష్ణా జిల్లాలో 10 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రచారం ప్రారంభించుకోవాల్సిందిగా అధినేత ఆదేశించారు. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో నూజివీడు, కైకలూరు అభ్యర్థుల అంశాన్ని మూడు నాలుగు రోజుల్లో నిర్ణయిస్తామని తెలిపినట్లు సమాచారం. ఈ రెండూ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఈ నెల 25లోపు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష ఉంటుందని ఆ సమయంలో ఆ రెండు నియోజకవర్గాలపైనా అధినేత స్పష్టత ఇస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ లభించిన వారిలో.. విజయవాడ పార్లమెంటు పరిధిలో.. విజయవాడ తూర్పు(గద్దె రామ్మోహన్), సెంట్రల్(బొండా ఉమ), పశ్చిమ(షబానా ఖాతూన్), మైలవరం(దేవినేని ఉమ), జగ్గయ్యపేట(శ్రీరాం తాతయ్య), నందిగామ(తంగిరాల సౌమ్య) మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో.. పెనమలూరు(బోడె ప్రసాద్), మచిలీపట్నం(కొల్లు రవీంద్ర), అవనిగడ్డ(మండలి బుద్ధప్రసాద్), గన్నవరం(వల్లభనేని వంశీ) ఉన్నారు.
ఇవీ పెండింగ్..! విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తిరువూరు నియోజకవర్గంపై అధినేత స్పష్టత ఇవ్వలేదు. ఇక్కడ గత ఎన్నికల్లో నల్లగట్ల స్వామిదాసు పోటీ చేసి ఓడిపోయారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో.. గుడివాడ, పెడన, పామర్రుపై అధ్యక్షుడు స్పష్టత ఇవ్వలేదు. పెడనలో కాగిత వెంకట్రావు అనారోగ్యం కారణంగా ఆయన ఈసారి బరిలోకి దిగడం లేదని సమాచారం. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. గుడివాడ అభ్యర్థి ఖరారు విషయంలోనూ ఆయన స్పష్టత ఇవ్వలేదు. రెండు మూడు రోజుల్లో అందరినీ పిలిపించి మాట్లాడ తానని రావి వెంకటేశ్వరరావుతో అధినేత పేర్కొన్నారు. పామర్రులో ఉప్పులేటి కల్పన విషయంలో స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గం అంశాన్ని పెండింగ్‌లో పెట్టారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి కొనకళ్ల నారాయణ, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేశినేని నాని పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.