కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని.. సుకర్లబాద్‌లో పెట్రో కెమికల్ బాంబులు కలకలం రేపాయి. ఓ ఇంటి మెయిన్ తలుపునకు, వంటగది తలుపునకు, అక్కడున్న బైక్‌కీ పెట్రో కెమికల్ బాంబులు అమర్చి ఉన్నాయి. తెల్లవారు జామున ఇంటి తలుపు తీసిన ఆ మహిళ... తలుపునకు తాడుతో కట్టి ఏదో కట్టినట్లు ఉండటంతో... అదేంటా అని లాగింది. అంతే... ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వచ్చింది. తలుపు విరిగిపడింది. లక్కీగా ఆమెకు ఏమీ కాలేదు. షాకైన ఆ మహిళ కాసేపటికి వంటగది తలుపుకి కూడా అదే విధంగా పెట్రో కెమికల్ బాంబు అమర్చి ఉండటాన్ని గమనించింది. వెంటనే పోలీసులకు కాల్ చేసి, కంప్లైంట్ ఇచ్చింది. అక్కడకు వచ్చిన పోలీసులు ఇల్లంతా గమనించారు.
అప్పుడు తెలిసింది... అక్కడున్న బైకుకి కూడా అలాంటి బాంబే అమర్చి ఉందని. బాంబు స్క్వాడ్ టీం ఆ బాంబుల్ని జాగ్రత్తగా తొలగించింది. ఈ విషయమై పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలిపామనీ, విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ బాంబును ఎవరు తెచ్చారు? దాడి చేయడానికి సిద్ధమవుతున్నారా? ఎవరినైనా లక్ష్యంగా చేసుకున్నారా? అనే కోణంలో విచారణ సాగుతున్నట్లు చెప్పారు.
ఇది ఇలా ఉంటే, గోరంట్ల మండలం కరావులపల్లిలో నాటు బాంబుల కలకలం రేపింది. వైసీపీ నేత ఆర్.వెంకటరెడ్డి ఇంటి వెనుక చెత్తకుప్పలో నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో నాటు బాంబులు దొరకడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబులు ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భారీ బధ్రత నడుమ ఎన్నికలు నిర్వహించే కసరత్తు చేస్తున్నారు. ఎక్కడికక్కడ, చెక్ పోస్ట్ లు పెట్టి, వాహనాలు చెక్ చేస్తూ, డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు.