వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న చిత్తూరు పశ్చిమ ప్రాంతాన్ని కొద్ది రోజుల్లో కృష్ణమ్మ పలకరించనుంది. ప్రాజెక్టు భూసేకరణ నుంచి టన్నెల్ తవ్వకాల వరకు అడ్డంకులు అధిగమించి.. చిత్తూరు జిల్లాకు బిరబిరా పరుగులిడేందుకు సిద్ధమైంది. న్యాయస్థానంలో ఉన్న చిక్కుల కారణంగా నిలిచిపోయిన పనులు పూర్తికావొచ్చాయి. హంద్రీ నీవా నీటిని జిల్లాకు తీసుకొచ్చేందుకు ఉన్న అవరోధాలు తొలగిపోయాయి. పుటపర్తి, మదనపల్లెలోనూ పనులు పూర్తికానున్నాయి. పుంగనూరు బ్రాంచి కెనాల్ ద్వారా పలమనేరు వరకు నీటిని ప్రధాన కాలువల్లో తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అనంతపురం జిల్లా నుంచి చిత్తూరుకు నీరు చేరుకోవాలంటే మరో 12 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ స్వయంగా ప్రకటించారు. సమస్యలన్నింటినీ అధిగమించి ట్రయన్ రన్ ద్వారా జిల్లాకు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే లేపాక్షి ప్రాంతానికి హంద్రీనీవా నీరు చేరుకుంది. పుటపర్తికి మరో రెండు రోజుల్లో నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాకు సుమారు 150 కి.మీల పొడవున కాలువ ఉంది. అక్కడికి నీరు చేరుకునేందుకు మరో 12 రోజుల సమయం పడుతుంది. నీరొచ్చేందుకు వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అనంతపురం, చిత్తూరు జిల్లాల పరిధిలో 16 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పటికే వీటి పనితీరును అధికారులు పరిశీలించి ఎక్కడా సమస్యలు లేవని గుర్తించడంతో పలమనేరు వరకు నీరు విడుదలకు మార్గం సుగమమైంది. చిత్తూరు జిల్లాకు నీరు రానుండటంతో అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. డ్రోన్ ద్వారా సర్వే చేపట్టారు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనే అంశాన్ని గుర్తించి వెంటనే పనులు పూర్తి చేస్తున్నారు. మొత్తంగా చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి సాగు, తాగునీటి సమస్యలు తొలగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.