నిన్నటి దాకా, తెలంగాణా ఎన్నికల ప్రచారంలో, చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకుని, కెసిఆర్, కేటీఆర్ ఎలా టార్గెట్ చేస్తున్నారో చూస్తున్నాం. ఇంకా మాట్లాడితే, ఉదయం కూడా, చంద్రబాబుని బూతులు తిట్టారు. అదంతా తెలంగాణాలోని వేరే జిల్లాల్లో. కాని, ఇప్పుడు కేటీఆర్ తెలంగాణాలోని మినీ ఆంధ్రా, కూకట్పల్లికి వచ్చి, అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిస్కట్ వేస్తున్నాడు. అక్కడకు వచ్చి, ఎక్కువగా చంద్రబాబుని సమర్ధిస్తూ, ఆయనను రాజకీయంగా ఎందుకు తిట్టాల్సి వచ్చిందో చెప్తున్నారు. ఆంధ్రా వారు అంటే చంద్రబాబు అన్నట్టు, కేటీఆర్ ఎంత సేపు చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ, కూకట్పల్లి ప్రజలను మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జగన్, పవన్ ప్రస్తావనే లేదు. వారి గురించి పెద్దగా పట్టించుకునే పని లేదని కేటీఆర్ అనుకున్నారో ఏమో..
కూకట్పల్లి నిజాంపేట్ రోడ్డులోని రాఘవరెడ్డి గార్డెన్లో ‘మన హైదరాబాద్.. మనందరి హైదరాబాద్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్.. కేసీఆర్ మాట్లాడిన మాటలు.. ఇక్కడి సెటిలర్లను ఉద్దేశించినవి కావని, టీడీపీ, చంద్రబాబును ఉద్ధేశించి మాట్లాడరని వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో విమర్శలు సహజం అని పేర్కొన్నారు. చంద్రబాబును విమర్శించడానికి కొన్ని కారణాలు ఉన్నాయనే విషయం వాస్తవమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలని చంద్రబాబు లేఖలు రాశారని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలోనే, వివిధ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుంటారని అన్నారు. వాస్తవానికి చంద్రబాబును కూడా తప్పు పట్టేలేమని... ఏపీ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాల్సిన బాధ్యత ఆయనపై ఉందని కేటీఆర్ తెలిపారు.
ఎగువన ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టులు కడితే, ఏపీకి నీరు రాదనే ఆందోళనతో ఆయన లేఖలు రాసి ఉండవచ్చని చెప్పారు. నందమూరి హరికృష్ణ దురదృష్టవశాత్తు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ నేతలు మానవీయ కోణంలో ఎలా స్పందించారో అందరికీ తెలుసని చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారని, అక్కడ నుంచి భౌతికకాయం హైదరాబాదుకు వచ్చేంత వరకు భౌతికకాయం పక్కనే ఉన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తాను కూడా ఆయన నివాసానికి వెళ్లి కుటుంబసభ్యలను ఓదార్చామని తెలిపారు. ఇక్కుడుండే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు తాను ఒకటే మాట ఇస్తున్నానని, మీలో ఒక వ్యక్తిగా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని కేటీఆర్ తెలిపారు. మీ మనసులో ఉన్న అనుమానాలన్నింటినీ పక్కన పెట్టాలని విన్నవిస్తున్నానని అన్నారు. ఓట్ల కోసం తప్పుడు మాటలు చెప్పే వ్యక్తిని తాను కాదని చెప్పారు. మొత్తానికి సీమంధ్ర ఓటర్ల కోసం, కూకట్పల్లిలో ఇలా ఫీట్లు చేస్తున్నాడు కేటీఆర్.