జగన్ కు ఎన్నికల వరకు సలహాలు ఇచ్చే, ప్రశాంత్ కిషోర్ టీం, కేటీఆర్ తో భేటీ పై దిమ్మ తిరిగే ఫీడ్ బ్యాక్ ఇచ్చింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ ప్రి ప్రజలు ఏమనుకుంటున్నారో అని, జగన్ సర్వే చేపించారు. అయితే, ప్రజల దాకా వెళ్ళకుండానే, కేవలం జగన్ అభిమానులను ముందుగా సర్వే చేస్తేనే దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయి. జగన్ పాదయాత్రతో పార్టీకి కాస్త మైలేజ్ వచ్చిందని సంబరపడుతున్న వైసీపీ కోఆర్డినేటర్లలో టీఆర్‌ఎస్‌తో జగన్ జట్టుకట్టడం షాక్‌కి గురిచేసిందని ఓ నేత వ్యాఖ్యానించారు. ఆంధ్రాపై అక్కసువెళ్లగక్కుతున్న పొరుగు రాష్ట్ర ప్రాంతీయ పార్టీ నేతల పంచన చేరితే ఇక్కడ సామాన్య జనం హర్షిస్తారా? అంటూ సదరు నేత ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వరకు కాస్త హుషారుగా ఉన్న వైసీపీ కేడర్‌లో ఈ తాజా పరిణామం నీళ్లుచల్లినట్టయిందని ఆ పార్టీ నేతలే ఆందోళన చెందుతున్నారు. కొన్ని నియోజకవర్గాలలో టికెట్ల కోసం పోటీపడిన నేతలలో కొందరు తమ ప్రయత్నాలకు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
‘‘ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడి ప్రచారం వల్ల అక్కడ మహాకూటమి ఓటమిపాలైందని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. చంద్రబాబు ఎప్పుడూ తెలంగాణ ప్రజలను, పాలకులను వ్యక్తిగత విమర్శలు చేయలేదని, అయినా చంద్రబాబుపై తెలంగాణలో అంత వ్యతిరేకత వచ్చిందంటే.. కేసీఆర్ మనల్ని ఆంధ్రోళ్లు దోపిడీదారులని, దొంగలని, ఆంధ్రా బిర్యానీ పేడ బిర్యాని అని, తెలంగాణ వచ్చాకా ఆంధ్రా విద్యా సంస్థలను నిషేధిస్తామని... ఇలా అనేక ఆంధ్రా వ్యతిరేక స్టేట్‌మెంట్స్ ఇచ్చి అవమానించారు. వాటిని ఆంధ్ర ప్రజలు ఎలా మర్చిపోతారు.. ఈ పరిణామం ఖచ్చితంగా వైసీపీకి పెద్ద మైనస్సే అవుతుంది..’’ అని ఓ రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.
‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అనే సూత్రం టీఆర్‌ఎస్ విషయంలో వర్తించదని... కేసీఆర్‌తో దోస్తీని సీమాంధ్ర ప్రజలు సహించరని చెబుతున్నారు. ప్రత్యేక హోదాపై వ్యతిరేకత, పోలవరంపై కేసుల దాఖలు, విద్యుత్తు వినియోగానికి సంబంధించి రూ.5200 కోట్ల ఎగవేత, ఉమ్మడి సంస్థల ఆస్తుల పంపిణీకి సహాయ నిరాకరణ... ఇలాంటి అనేక అంశాల నేపథ్యంలో టీఆర్‌ఎ్‌సతో చేతులు కలపడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తెలంగాణ గడ్డపైనే సోనియా, రాహుల్ చేసిన ప్రకటనపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ తదితర టీఆర్‌ఎస్ నేతలు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సంప్రదింపులు జరపడం ద్వారా అధికార టీడీపీకి కొత్త ఆయుధం ఇచ్చినట్లయిందని వైసీపీ కీలక నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, టీఆర్‌ఎస్ నేతలు ఏపీలో వైసీపీ తరఫున ప్రచారం చేస్తే తమకే నష్టమని చెబుతున్నారు.