రాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి ఊహించని పరిణామం చోటుచేసుకుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు... ఈరోజు ఉదయం లేవగానే పత్రికల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా వార్త చూసి చాలా ఖంగుతిన్నానని కేటీఆర్ వెల్లడించారు... హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా-2018 సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ వింగ్స్ ఇండియా-2018 సదస్సును ప్రారంభించారు.
వింగ్స్ ఇండియా-2018 సదస్సు నాలుగు రోజుల పాటు జరగనుంది. అయితే వింగ్స్ ఇండియా సదస్సుకు ముఖ్య అతిథిగా రావాల్సిన అశోక్ గజపతి రాజు… ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల కారణంగా రాలేకపోవడం చాలా దురదృష్టకరమని వివరించారు. దాంతో ఈ సదస్సుకు తాను ముఖ్య అతిథిగా వ్యవహరించాల్సి వచ్చిందని తెలిపారు. కాగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు.
అశోకగజపతిరాజు కు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. దేశంలో 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు ఉంటే అశోక్ గజపతి రాజు సారథ్యంలో మూడేళ్లలోనే 50 నుంచి 60కిపైగా విమానాశ్రయాలు కొత్తగా ఏర్పాటు చేశారని ఆ ఘనకీర్తి ఆయన దక్కుతుందని పేర్కొన్నారు. ఇంకా భారత వైమానిక రంగం మరింత వృద్ధి చెందాలని కోరుకుంటున్నానని కేటీఆర్ వివరించారు.