ఏపీ ఎన్నికల వేళ.. ఆంధ్రా, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేసీఆర్ టార్గెట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం కేసీఆర్‌తో కలిసి నడిస్తే తప్పేంటని జగన్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మాత్రం.. దూకుడుగా కేసీఆర్‌పై విమర్శలు సాగిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రాంత నేతలు ఆయనకు కౌంటర్లు వేస్తున్నారు. తెలంగాణలో ఆస్తులు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను తాను బెదిరిస్తున్నానంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము ఎవరిని బెదిరించడం లేదని బెదిరించాల్సిన అవసరం తమకేముందని చెప్పుకొచ్చారు.
ఓ న్యూస్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్ వల్లభనేని వంశీమోహన్ అనే ఎమ్మెల్యే ఎవరో తనకు తెలియదన్నారు. అలాంటిది తాను ఆయన్ను బెదిరించానని ప్రచారం చేసుకుంటున్నారని ఇది దుర్మార్గమన్నారు. కనీసం వంశీకి ఎక్కడ స్థలం ఉందో ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఇక మరో పక్క తలసాని కూడా స్పందించారు. తెలంగాణలో ఆంధ్రోళ్లను కొడుతున్నారంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో ఎవరిపై ఎక్కడ దాడులు జరిగాయో పవన్ చెప్పగలరా? అని ప్రశ్నించారు.
పవన్ తన వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిన్నటివరకు హైదరాబాద్‌లోనే ఉన్న పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని నిలదీశారు. ఏపీ రాజకీయాలన్నీ కేసీఆర్ చుట్టే తిరుగుతున్నాయని తలసాని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు జగన్ సీఎం కావడం ఖాయమని తలసాని జోస్యం చెప్పారు. వైసీపీకి 125-130 అసెంబ్లీ, 18-23 ఎంపీ సీట్లు వస్తాయని జాతీయ సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. ఏపీలో టీడీపీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు.